అసోం రైఫిల్స్ ద‌ళాల‌పై ఉగ్ర‌వాదుల కాల్పులు.. ఒక‌రు మృతి

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో దారుణం జ‌రిగింది. భద్ర‌తా ద‌ళాల్లో కీల‌క విభాగ‌మైన అసోం రైఫిల్స్ బృదాల‌పై ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో ఒక జ‌వాన్ మృతిచెంద‌గా, మ‌రో న‌లుగురు గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న అరుణాచ‌ల్ ప్ర‌దేశ్, చంగ్లాంగ్ జిల్లాలో ఇండియా-మ‌య‌న్మార్ స‌రిహ‌ద్దులో మంగ‌ళ‌వారం జ‌రిగింది. ఉద‌యం 6.30 గంట‌ల స‌మ‌యంలో 21 అసోం రైఫిల్స్ బృందానికి చెందిన జ‌వాన్లు నాంపోంగ్ న‌ల్లా ప్రాంతంలో సాధార‌ణ పెట్రోలింగ్ నిర్వ‌హిస్తుండ‌గా ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రిపారు.

ఇది ఇండియా-మ‌య‌న్మార్ స‌రిహ‌ద్దు కావ‌డంతో ఇక్క‌డ కంచె ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో త‌నిఖీ నిర్వ‌హిస్తుండ‌గా ఉగ్ర‌వాదులు ఉన్న‌ట్లుండి అసోం సైనిక ద‌ళాల‌పై కాల్పులు జరిపారు. ఈ ఘ‌ట‌న‌లో హ‌విల్దార్ జంఖోకాయ్ కుకి (42) అనే జ‌వాన్ మ‌ర‌ణించాడు. మ‌రో న‌లుగురు గాయ‌ప‌డ్డారు. వెంట‌నే క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స కోసం వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఘ‌ట‌న జ‌రిగిన వెంటనే భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఈ ప్రాంతంలో భారీ స్తాయిలో మోహ‌రించారు. భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు.

ఉగ్ర‌వాదుల కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ప్రాథ‌మిక అంచ‌నా ప్ర‌కారం ఎన్ఎస్‌సీఎన్ (కే-వైఏ) అనే ఉగ్ర‌వాద సంస్థ ఈ కాల్పులు జ‌రిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఈ విష‌యంలో అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉంది. మ‌రోవైపు ఈ కాల్పుల ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు కొన‌సాగుతోంద‌ని స్థానిక పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో, అంతర్జాతీయ సరిహద్దుకు ఆవలి వైపున కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనేక నిషేధిత తిరుగుబాటు గ్రూపుల కదలికల కారణంగా చాంగ్లాంగ్‌లోని భారత్-మయన్మార్ సరిహద్దు ఒక సున్నితమైన ప్రాంతంగా మిగిలిపోయింది.

అస్సాం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ వికాస్ లఖేరా ఈ దాడిని ఖండించి, అమరుడైన హవల్దార్‌కు నివాళులర్పించారు.  “29 సెప్టెంబర్ 2026న అరుణాచల్ ప్రదేశ్‌లోని చాంగ్లాంగ్‌లో విధి నిర్వహణలో అత్యున్నత త్యాగం చేసిన హవల్దార్ జాంగ్‌ఖోకై కుకీకి అస్సాం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ వికాస్ లఖేరా, ఏవీఎస్ఎం, ఎస్ఎం, అస్సాం రైఫిల్స్‌లోని అన్ని ర్యాంకుల వారు ఘన నివాళులర్పిస్తున్నారు. మన ధైర్యవంతుడైన సైనికుడి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు,” అని ఆ పారామిలిటరీ దళం ఎక్స్   పోస్ట్‌లో పేర్కొంది. తమ డైరెక్టర్ జనరల్,  అన్ని ర్యాంకుల వారు మృతుని కుటుంబానికి గట్టిగా అండగా నిలుస్తారని కూడా ఆ దళం తెలిపింది.

About The Author