సీబీఎస్‌ఈ మూడు భాషల విధానంపై సుప్రీంకోర్టు ప్రస్తుతం 6వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 7వ తరగతి విద్యార్థులకు ఇచ్చిన వెసులుబాటునే కల్పించాలని సూచించింది. దీంతో ఇప్పటికే ఓ భాషను చదువుతున్న విద్యార్థులు అకస్మాత్తుగా మరో భాషకు మారాల్సిన పరిస్థితి ఉండదు. సీబీఎస్‌ఈ కొత్త విధానం ప్రకారం విద్యార్థులు మూడు భాషలు చదవాలి.
ఇందులో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలి. ఈ విధానాన్ని 6వ తరగతి నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుత 6వ తరగతి విద్యార్థులు ఇప్పటికే తమకు నచ్చిన భాషలను చదువుతున్నారు. ఇప్పుడు కొత్తగా మరో భాషను తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తే వారికి ఇబ్బందులు ఎదురవుతాయని పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు.
కొంతమంది విద్యార్థులు 4వ తరగతి నుంచే ఒక నిర్దిష్ట భాషను చదువుతున్నారు. ఇప్పుడు మధ్యలో ఆ భాషను మార్చి మరో భాషను నేర్చుకోవాల్సి వస్తే వారి చదువుపై ప్రభావం పడుతుందని పిటిషనర్లు వాదించారు. కొత్త భాషకు అవసరమైన టీచర్లు, పుస్తకాలు అన్ని పాఠశాలల్లో అందుబాటులో ఉన్నాయా? అనే ప్రశ్న కూడా తలెత్తింది.
మూడు భాషల విధానాన్ని అమలు చేసేందుకు చాలా సీబీఎస్‌ఈ పాఠశాలలు సిద్ధంగా ఉన్నాయని కేంద్రం కోర్టుకు తెలిపింది. దాదాపు 99 శాతం పాఠశాలల్లో అవసరమైన ఏర్పాట్లు ఉన్నాయని పేర్కొంది. కేవలం 1.2 శాతం పాఠశాలల్లోనే ఇబ్బందులు ఉన్నాయని వివరించింది. విద్యార్థులు ఇప్పటికే ఒక భాషను చదువుతున్న సమయంలో ఒక్కసారిగా కొత్త భాషను ప్రవేశపెడితే వారికి అదనపు ఒత్తిడి ఏర్పడవచ్చని కోర్టు అభిప్రాయపడింది.
అందుకే ప్రస్తుత 6వ తరగతి విద్యార్థులకు కూడా 7వ తరగతి విద్యార్థుల మాదిరిగా వెసులుబాటు కల్పించాలని సూచించింది.అయితే మూడు భాషల విధానాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయలేదు. విధానం ఎలా అమలు చేయాలి? విద్యార్థులపై ఎంత భారం పడుతుంది? భాషల ఎంపిక ఎలా ఉండాలి? వంటి అంశాలపై విచారణ కొనసాగనుంది.

More Stories
లవ్లీ యూనివర్సిటీలో నిరసనలతో ఇంటర్నెట్ సేవలు బంద్
పోక్సో కేసు నుంచి ముస్లిం పర్సనల్ చట్టం రక్షణ కల్పించదు
2022 నుండి పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్యెల్యేలు