ఎన్నికల సంఘం ఏకగ్రీవ వివరణతో అన్ని అపోహలకు తెరపడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈసీ ప్రకటనపై ఎక్స్ వేదికగా చంద్రబాబు స్పందిస్తూ ఇందులో ఆయన స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ పై ఎన్నికల కమిషనర్లు ఏకగ్రీవంగా చేసిన ప్రకటన అపోహలకు ముగింపు పలికిందని చెప్పారు. ఉమ్మడి ప్రకటన ఈసీ విశ్వసనీయతను స్పష్టం చేసిందని పేర్కొన్నారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు ఎస్. ఎస్. సంధూ, వివేక్ జోషి కలిసి ఏకగ్రీవంగా ఇచ్చిన వివరణ మన రాజ్యాంగ సంస్థల సమగ్రతను, విశ్వసనీయతను మరోసారి స్పష్టం చేసిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంశంపై నెలకొన్న అపోహలకు ఇది తెరదించిందని తెలిపారు.
“రాజ్యాంగ సంస్థల విశ్వసనీయత, సమగ్రతను ఈసీ వివరణ మరోసారి చాటింది. సర్‌పై నిర్ణయాలు సమష్టిగానే తీసుకుంటున్నారు. నిర్ణీత నిబంధనలు, సంస్థాగత విధానాలకు అనుగుణంగానే సర్‌పై నిర్ణయాలు. రాజకీయ లబ్ధి కోసం వ్యవస్థల విశ్వాసాన్ని దెబ్బతీయడం సరికాదు. ఎన్నికల ఫలితాలు ప్రజల తీర్పును ప్రతిబింబిస్తాయి” అని చంద్రబాబు తెలిపారు.
కాగా, నాయకులు, గెలుపు, ఓటములను హుందాగా స్వీకరించాలని, రాజ్యాంగ సంస్థలపై గౌరవం, ప్రజల విశ్వాసాన్ని కాపాడటం పార్టీల బాధ్యత అని పేర్కొంటూ ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ పై విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్షాలకు ఆయన హితవు చెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన నిర్ణయాలు సమష్టిగా, సంస్థాగత విధివిధానాలను కచ్చితంగా పాటిస్తూ తీసుకుంటారని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికల ప్రక్రియలపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు దురదృష్టకరమని తెలిపారు. మన రాజ్యాంగ సంస్థలను గౌరవించడం అత్యంత ముఖ్యమని చెబుతూ భారత ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం పార్టీలకు అతీతంగా నాయకులందరి ఉమ్మడి బాధ్యత అని చంద్రబాబు తేల్చిచెప్పారు.
కేంద్ర ఎన్నికల సంఘంలో సిఈసి జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొంటున్నారని, మిగతా కమిషనర్లు సంధు, వివేక్ జోషీలను పరిగణనలోకి తీసుకోవట్లేదని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈసీ వివరణ ఇవ్వాలంటూ టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈసీ విభేదాల్ని తెరపైకి తెచ్చిన ఇండియన్ ఎక్స్ ప్రెస్ తో మాట్లాడుతూ డిమాండ్ చేసిన మరుసటి రోజు చంద్రబాబు ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరింప చేసుకుంటుంది.

More Stories
నెహ్రూ సోషలిజాన్ని వర్తింపచేసే ప్రయత్నంతో దేశం వెనుకంజ
దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలు ప్రపంచానికి దిక్సూచి
అంబటి రాంబాబుకు మరోసారి ఈడీ నోటీసులు