‘ఫామ్ 6’లో చిన్న మార్పు ఎన్నికల కమిషన్ లో సృష్టించిన దుమారం

తొలిసారి ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఉపయోగించే ‘ఫామ్-6’లో చిన్న మార్పు తీసుకు రావడం కేంద్ర ఎన్నికల కమిషన్ ను తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టివేసింది. ఈ విషయమై సీఈసీ జ్ఞానేష్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై మిగతా ఎన్నికల కమిషనర్లు వివేక్ జోషి, సుఖ్‌బీర్ సింగ్ సంధూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ మార్పులు ‘చట్టవిరుద్ధం, అనధికారికం’ అని పేర్కొన్నట్లు మూడు నెలల తర్వాత ఇప్పుడు బహిర్గతం కావడం పెను రాజకీయ దుమారం రేపుతోంది. 
 
వివేక్ జోషి, సుఖ్బీర్ సింగ్ సంధు అనే ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఈ మార్పులను “చట్టవిరుద్ధం” , “అనధికారికం” అని అభివర్ణించారని, కొత్త ఓటర్ల ప్రయోజనాల దృష్ట్యా వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారని ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ నివేదించడం సీఈసీ జ్ఞానేశ కుమార్ ను ఆతరక్షణలో పడవేసేటట్లు చేసింది. అలాగే ఫారం 6 ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 
 
భారతదేశంలో ఓటరుగా నమోదు చేసుకోవాలనుకునే ఎవరైనా ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఫారం 6ను నింపాల్సి ఉంటుంది. ఇందులో వ్యక్తిగత వివరాలు, ఫోటోగ్రాఫ్, వయస్సు, చిరునామాకు సంబంధించిన ఆధారాలు అడుగుతారు. ఈ ఫారంను ‘ఓటర్ల నమోదు నియమావళి, 1960’  ప్రకారం రూపొందించారు. జూలై 2026లో, ఈసీఐ  ‘ఈసీఐనెట్’  పోర్టల్‌లోని ఫారం 6 ఆన్‌లైన్ వెర్షన్‌లో ఒక కొత్త డిక్లరేషన్‌ను  చేర్చడానికి మార్పులు చేశారు. 
 
ఈ మార్పు ద్వారా ఫారం 6లో ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (ఎస్ఐఆర్)కు సంబంధించిన ప్రశ్నలను చేర్చారు. దరఖాస్తుదారులు మూడు అంశాలలో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది: 2000ల ప్రారంభంలో జరిగిన చివరి ఎస్ఐఆర్ సమయంలో వారి పేరు ఓటర్ల జాబితాలో ఉందా? వారి తల్లిదండ్రులు లేదా తాతామామల పేర్లు ఆ జాబితాలో ఉన్నాయా? లేదా వారి పేరు గానీ, వారి తల్లిదండ్రుల పేర్లు గానీ అందులో లేవా? 
 
ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో ఫారాన్ని పూర్తి చేయలేరు. అనేక రాష్ట్రాల్లో చివరిసారిగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) 2000ల ప్రారంభంలో జరిగింది. కాగా మరికొన్ని రాష్ట్రాలు గత ఏడాది లేదా ఈ ఏడాది మాత్రమే దీనిని పూర్తి చేశాయి. ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ నివేదిక ప్రకారం, ‘ఫారం 6’ అనేది ‘ఓటర్ల నమోదు నియమావళి, 1960’లో భాగం కాబట్టి,
దీనిని మార్చాలంటే కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా చట్టసవరణ చేసి, పార్లమెంట్ ముందు ఉంచాలి. కానీ, కేవలం ఆన్‌లైన్ ఫారమ్‌ను ఎడిట్ చేసి ఈ మార్పులు తీసుకురావడం ‘చట్టవిరుద్ధం, అనధికారికం’ అని కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి లిఖితపూర్వకంగా స్పష్టం చేశారు.  ఈ అంశంపై మే నెలలోనే కమిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, జులైలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ నాయకత్వంలో ఈ మార్పులను అమలు చేశారు.
అంతర్గత చర్చల్లో అభిప్రాయ భేదాలు సహజమని, కమిషన్ తీసుకునే నిర్ణయాలు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని ఈసీ తెలిపింది. గత ఏడాది కాలంలో పూర్తి స్థాయి కమిషన్ తీసుకున్న నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగానే ఉన్నాయని కూడా అది పేర్కొంది.  ఒక వ్యక్తి ఓటు వేసే అర్హత అనేది వారి వయస్సు, పౌరసత్వం, సాధారణ నివాసం వంటి అంశాలపై ఆధారపడి నిర్ణయించబడుతుంది తప్ప, వారి తల్లిదండ్రుల పేర్లు గత ఓటర్ల జాబితాలో ఉన్నాయా లేదా అనే దానిపై కాదు.
ప్రస్తుతం జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఓటర్ల జాబితాల నుండి దాదాపు 13 కోట్ల పేర్లు తొలగించారు.  వీటిలో మరణించిన ఓటర్లు, వేరే ప్రాంతాలకు మారినవారు లేదా ఒకే వ్యక్తి పేరు ఒకటి కంటే ఎక్కువసార్లు నమోదైన సందర్భాలు ఉన్నప్పటికీ, చాలా మంది తమ పేర్ల తొలగింపును వ్యతిరేకిస్తున్నారు. కొత్త ఓటర్ల కోసం ఉద్దేశించిన ఫారమ్‌లో గత ఎస్ఐఆర్ కి సంబంధించిన ప్రశ్నను చేర్చడం, మొదటిసారిగా నమోదు చేసుకోవాలనుకునే యువతపై దాని ప్రభావం గురించి ఆందోళనలను రేకెత్తించింది. 
 
తమ తల్లిదండ్రులు లేదా తాతామామల పేర్లు గత ఎస్ఐఆర్ జాబితాలో లేని 18 ఏళ్ల వయస్సు గల వ్యక్తి, తల్లిదండ్రులు, తాతామామలకు సంబంధించిన మొదటి రెండు ఎంపికలను ఎంచుకోలేరు. అలాగే, దరఖాస్తుదారు మూడవ ఎంపిక అయిన “ఏదీ కాదు”  అనే దానిని ఎంచుకుంటే ఏమి జరుగుతుందనే విషయాన్ని కూడా ఆ ఫారమ్ వివరించలేదు.
 
ఫారం 6లోని కొత్త ప్రశ్న, కుటుంబాలు రెండు తరాల మధ్య పత్ర సంబంధాలను ఏర్పరచుకోగలవని భావిస్తుంది. ఇది వలసదారులను, పేద కుటుంబాలను, రాష్ట్రాలు దాటి వేరే ప్రాంతాలకు తరలివెళ్లిన వారిని అసమానంగా ప్రభావితం చేస్తుందని విమర్శకులు వాదిస్తున్నారు.
 
తొలగించిన’ ఓటర్లను తొలిసారి ఓటర్లుగా దరఖాస్తు చేసుకోవాలని ఆదేశం 
 
2025 జూన్‌లో బీహార్‌లో ప్రారంభమైన, ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్ఐఆర్  ప్రక్రియ కింద, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా ముసాయిదా ఓటర్ల జాబితాల నుండి 13 కోట్ల పేర్లు తొలగించారు. వీరిలో కొందరు సంవత్సరాల క్రితమే నమోదైన ఓటర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు, సవరించిన జాబితాలో తమ పేర్లను తిరిగి చేర్చుకోవడానికి ఫారం 6ను ఉపయోగించమని వారిని కోరుతున్నారు. 
 
సమస్య ఏమిటంటే, ఫారం 6లో దరఖాస్తుదారు “మొదటిసారి ఓటర్ల జాబితాలో చేరడానికి దరఖాస్తు చేసుకుంటున్నారని”, వారి పేరు ఏ అసెంబ్లీ లేదా పార్లమెంటరీ నియోజకవర్గంలోనూ చేర్చలేదని పేర్కొంటూ తప్పనిసరిగా ఒక ప్రకటన చేయాల్సి ఉంటుంది. తిరిగి చేర్చబడాలని కోరుకునే ‘తొలగించిన’ ఓటరు, నిర్వచనం ప్రకారం, అప్పటికే ఓటర్ల జాబితాలో కనిపించి ఉంటారు.
 
దానితో ఇప్పటికే ఓటు ఉండి తొలగింపునకు గురైన వ్యక్తి, తాను ‘మొదటిసారి దరఖాస్తు చేస్తున్నట్లు’ తప్పుడు డిక్లరేషన్ ఇస్తే, అది ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950, సెక్షన్ 31 ప్రకారం నేరం అవుతుంది. దీనికి ఏడాది వరకు జైలు శిక్ష లేదా జరిమానా పడే అవకాశం ఉంది.చట్టసవరణ లేకుండా ఆన్‌లైన్ ఫామ్‌లో తీసుకొచ్చిన ఈ మార్పు ప్రజాస్వామ్య ప్రక్రియకే విఘాతం కలిగిస్తుందని ప్రతిపక్షాలు, విమర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
 

About The Author