ఓటర్ల జాబితాల ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (ఎస్ఐఆర్) విషయంలో ఎన్నికల సంఘంలో తలెత్తిన భిన్నాభిప్రాయాలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఈసి) జ్ఞానేశ్ కుమార్ స్పష్టత ఇవ్వాలని, ప్రజల మనసుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని బీజేపీ మిత్రపక్షాలు కోరాయి. ఎన్నికల సంఘంలో నెలకొన్న విభేదాలపై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం) నుండి ఈ ప్రకటనలు వెలువడ్డాయి.
తమకు తెలియకుండా తీసుకున్న ఎస్ఐఆర్-సంబంధిత నిర్ణయాలు, ప్రక్రియలలోని స్పష్టమైన లోపాలపై ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి గత 10 నెలల్లో కనీసం 14 సార్లు రికార్డు స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేశారని ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సెప్టెంబర్ 23న నివేదించింది.
“స్వతంత్ర రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘంపై ప్రశ్నలు తలెత్తినప్పుడు, తన వైఖరిని స్పష్టంగా తెలియజేయాల్సిన బాధ్యత సిఈసిపై ఉంటుంది. ఎన్నికల ప్రక్రియపైనే ప్రజలకు అనుమానాలు కలిగితే అది సమస్యాత్మకం అవుతుంది. ఎన్నికల సంఘం తన వైఖరిని రాహుల్ గాంధీకి కాకుండా ప్రజలకు వివరించాలి. ప్రజల మనసుల్లో ఉన్న సందేహాలను అది తప్పక నివృత్తి చేయాలి,” అని కేంద్ర మంత్రి, ఎల్జేపీ (ఆర్వి) అధినేత చిరాగ్ పాశ్వాన్ విలేకరులతో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్ఐఆర్ “పారదర్శక పద్ధతిలో నిర్వహించారని” పేర్కొన్న టీడీపీ లోక్‌సభ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణదేవరాయలు, “అదే సమయంలో, భారత ఎన్నికల సంఘం మన ప్రజాస్వామ్యంలో కీలక బాధ్యత కలిగిన ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. కాబట్టి, ఎవరైనా ప్రశ్నలు లేవనెత్తినప్పుడు, తగిన వివరణ ఇవ్వడం, పారదర్శకతను పాటించడం వల్ల ఆ సంస్థపై ప్రజల విశ్వాసం మరింత బలపడుతుంది,” అని తెలిపారు.
ఆర్ఎల్ఎం అధినేత, రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్వాహ మాట్లాడుతూ, “ఇప్పటివరకు జరిగిన పరిణామాలను బట్టి చూస్తే, ఎన్నికల సంఘం పనితీరులో ఖచ్చితంగా ఏదో సమస్య ఉందని అర్థమవుతోంది. ఏది ఏమైనప్పటికీ, ఎన్నికల సంఘం తన వైఖరిని స్పష్టం చేయాలి… లేవనెత్తిన ప్రశ్నలు, వ్యక్తం చేసిన ఆందోళనలపై అది వివరణ ఇవ్వాలి,” అని స్పష్టం చేశారు.
“ఆరోపణలు నిజమే అయితే” ప్రతిపక్షం ఎందుకు అధికారికంగా ఫిర్యాదు చేయలేదని జెడియు అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ ప్రశ్నించారు. “తాము ఓడిపోబోతున్నామని ఆర్జేడీకి ముందే తెలుసు. వారు పదేపదే ఎన్నికల సంఘంపై నిందలు వేయడానికి ప్రయత్నించారు. అయితే, ఎస్ఐఆర్ లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చినప్పుడు భారత ఎన్నికల సంఘం వివరణ కోరింది. అలాగే, ఇన్ని ఆరోపణలు ఉన్నప్పుడు అధికారిక ఫిర్యాదు ఎందుకు చేయలేదని ప్రశ్నించింది,” అని ఆయన విలేకరులతో చెప్పారు.

More Stories
బ్రహ్మోస్ మిసైల్తో పాక్కు నిద్రలేని రాత్రులు
విద్యార్థి కాలర్ పట్టుకున్న ప్రొఫెసర్… ఎబివిపి నిరసన
నాగాలాండ్, అరుణాచల్, మణిపూర్లలో ఏఎఫ్ఎస్పీఏ పొడిగింపు