తెలుగు రాష్ట్రాల బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా మధుకర్

బీజేపీ తన సంస్థాగత నిర్మాణంలో పలు కీలక మార్పులు చేసింది. దేశవ్యాప్తంగా రాష్ట్రాల వారీగా కొత్త సంస్థాగత ప్రధాన కార్యదర్శులు, సంయుక్త ప్రధాన కార్యదర్శులను నియమించింది.  తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మధుకర్‌ను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆయన ప్రస్తుతం విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. 

ఇకనుండి హైదరాబాద్‌ కేంద్రంగా ఆయన రెండు తెలుగు రాష్ట్రాలలో పార్టీ సంస్థాగత వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సంయుక్త సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా దశరథ్‌ నియమితులయ్యారు. వరంగల్‌ కేంద్రంగా ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇప్పటివరకు తెలంగాణ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉన్న చంద్రశేఖర్ తివారీని మధ్యప్రదేశ్ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 

జాతీయ సంయుక్త సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా శివప్రకాశ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, గోవా రాష్ట్రాల సంస్థాగత వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతను కేటాయించారు. ఆయన కేంద్రంగా ముంబైలో పనిచేయనున్నారు. మరో జాతీయ సంయుక్త సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా సౌదాన్‌ సింగ్‌ను నియమించారు. ఆయనకు బిహార్‌, ఝార్ఖండ్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు. భువనేశ్వర్‌ కేంద్రంగా ఆయన పనిచేయనున్నారు.

About The Author