22ఏపై దిగొచ్చిన ప్రభుత్వం…  భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతి 

22ఏ నిషేధిత భూముల జాబితాపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగొచ్చింది. ఇప్పటివరకు అసలు తప్పే జరుగలేదని, 22ఏ సమస్యే లేదంటూ బుకాయించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆ సమస్యలను పరిష్కరించనున్నట్టు ప్రకటించింది. 22ఏ జాబితాలో ఉన్నప్పటికీ జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, మున్సిపల్‌ అనుమతులు ఉన్న ఇండ్లు, ఓపెన్‌ ప్లాట్లు, ఫ్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయాలని సబ్‌ రిజిస్ట్రార్లకు ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీచేసింది
 
 గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ), హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ), డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) వంటి చట్టబద్ధమైన ప్లానింగ్ అథారిటీల నుంచి అనుమతులు పొందినప్పటికీ. సాంకేతిక లోపాలు, రెవెన్యూ వర్గీకరణల కారణంతో రిజిస్ట్రేషన్ చట్టంలోని సేసిటోన్ 22ఏ నిషేధిత జాబితా పరిధిలో ఉండిపోయిన ఆస్తుల రిజిస్ట్రేషన్లకు  అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. 
 
ఈ సరికొత్త ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. గత కొంతకాలంగా 22ఏ నిషేధిత భూముల అంశంపై తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర వివాదానికి దాటితీసింది. రైతులు, ప్రతిపక్షాల నుండి తీవ్ర ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి. ఇటీవలే ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లోనూ దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య సుదీర్ఘ చర్చలు, ఆరోపణలు, విమర్శలు జరిగాయి. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ ప్రజల ఇబ్బందులను తొలగిస్తూ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.

త్వరలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగనున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే 22ఏ నిషేధిత భూముల జాబితా వివాదం తెరపైకి వచ్చింది. దీంతో సర్కార్‌ గుండెల్లో గుబులు రేగింది. ఈ సమస్య ఇలాగే ఉంటే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించడం ఖాయమనే భయం అధికారపార్టీ నేతల్లో ఆవహించింది. ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై వేటుపడటంతో ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక అనివార్యమైంది. 

ఈ నేపథ్యంలో రంగారెడ్డి, జీహెచ్‌ఎంసీ పరిధిలోని మరికొంత మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపైనా వేటు తప్పదనే భయం పట్టుకుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల భయంతో సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. మరోవైపు 22ఏ భూములకు సంబంధించి అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై సమగ్ర విచారణ చేపట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ఒక ప్రత్యేక కమిటీని నియమించింది. 

టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ శ్రీదేవసేన ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో రాజీవ్‌గాంధీ హనుమంతు, సందీప్‌కుమార్‌ ఝా, ఆయా జిల్లాల కలెక్టర్లు సభ్యులుగా ఉంటారు.  అయితే, ఈ విచారణ కేవలం 22ఏ భూములకే పరిమితం కాకుండా భూ అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం కమిటీని నియమించిన్నట్లు,  రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో జరిగిన భూముల కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై, అంశాలపై సమగ్ర విచారణ కోసం ప్రత్యేకం గా ఈ కమిటీని ఏర్పాటు చేసిన్నట్లు తెలిపింది. 

 

 

About The Author