* కోర్టు ధిక్కార చర్యలకు రంగం సిద్ధం
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌పై అభిశంసనకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ విషయంపై మిత్రపక్షాలను సంప్రదించిన కాంగ్రెస్ పార్టీ, రాబోయే రెండు వారాల్లో దీనిని సమర్పిస్తుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్ చొరవతో ‘ఇండియా’ కూటమిలోని భాగస్వామ్య పక్షాలు దీనికి ఆమోదం తెలిపినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ తీర్మానానికి సంబంధించిన నోటీసును సిద్ధం చేస్తున్నారని, వచ్చే వారంలోనే పార్లమెంటులో దాఖలు చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి గత 10 నెలల్లో ఎస్ఐఆర్ సహా వివిధ నిర్ణయాలు, ఆదేశాలపై కనీసం 14 సార్లు అధికారికంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారంటూ ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం ప్రచురించిన మర్నాడే ఈ పరిణామం చోటుచేసుకుంది. దీంతో ఎలక్షన్ కమిషన్ పనితీరు, దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎస్ఐఆర్‌పై రాజకీయ వివాదానికి తెరలేచింది. పత్రికలో అభ్యంతరాల ఆధారంగా జ్ఞానేష్ కుమార్‌పై చర్యలు తీసుకోవడానికి బలమైన కారణాలు ఉన్నాయని విపక్షాలు అంటున్నాయి.
అయితే, తమ నిర్ణయాల్లో అభిప్రాయభేదాలు ఉన్నాయనే వాదనను లేదా ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు అధికారికంగా విభేదించారనే వార్తలను ఈసీ తోసిపుచ్చింది. ఎస్ఐఆర్ తో సహా గడిచిన ఏడాది కాలంలో తీసుకున్న అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగానే జరిగాయని స్పష్టం చేసింది. జ్ఞానేష్ కుమార్‌పై విపక్షాలు అభిసంశన తీర్మానం ఇవ్వడం ఇది మొదటిసారి కాదు. ఏప్రిల్ 24న, రాజ్యసభలోని 73 మంది ప్రతిపక్ష ఎంపీలు ఆయనను పదవి నుంచి తొలగించాలని కోరుతూ నోటీసు ఇచ్చారు.
ఆ నోటీసులో తొమ్మిది నిర్దిష్ట ఆరోపణలు ఉన్నాయని కాంగ్రెస్ తెలిపింది. మార్చి 12న కూడా విపక్షాలు ఇలాంటి ప్రయత్నమే చేయగా, రాజ్యసభ చైర్మన్ ఆ నోటీసును తిరస్కరించారు. ఏప్రిల్ నాటి నోటీసు ఇంకా పెండింగ్‌లోనే ఉందని విపక్ష నేతలు చెబుతున్నారు. కాగా, కొత్తగా బయటపడిన వివరాలను కూడా చేర్చుతూ మరో నూతన నోటీసును సిద్ధం చేస్తున్నట్లు వర్గాలు తెలిపాయి.
ఏప్రిల్‌లో నోటీసుపై సంతకం చేసిన 73 మంది ఎంపీలలో ఏడుగురు ఆ తర్వాత పార్టీలు మారడంతో, ప్రస్తుత సభ బలాబలాలు, తాజా ఆరోపణల ఆధారంగా కొత్తగా తీర్మానం ఇవ్వాల్సిన అవసరం ఏర్పడిందని విపక్ష వర్గాలు పేర్కొన్నాయి. మార్చిలో లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ విపక్షాలు నోటీసులు ఇవ్వగా, ఏప్రిల్ 6న రాజ్యసభ ఛైర్మన్, లోక్‌సభ స్పీకర్ వాటిని తిరస్కరించారు.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను పదవి నుంచి తొలగించే ప్రక్రియ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే ప్రక్రియతో సమానంగా ఉంటుంది. నిర్ణీత సంఖ్యలో ఎంపీలు ప్రతిపాదిస్తేనే ఈ ప్రక్రియ మొదలవుతుంది. తీర్మానం ఆమోదం పొందితే విచారణ కమిటీ ఏర్పాటై, ఆ తర్వాత పార్లమెంటులో ప్రత్యేక మెజారిటీ సాధించాల్సి ఉంటుంది.
మరోవంక, తోటి కమిషనర్లు అభ్యంతరాలు చెబుతున్నా పట్టించుకోకుండా కోర్టు తీర్పుల్ని ఉల్లంఘించిన వ్యవహారంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై కోర్టు ధిక్కార చర్యలకు రంగం సిద్దమవుతోంది. సీఈసీ జ్ఞానేష్ కుమార్ గతంలో సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో ఇచ్చిన తీర్పుల్ని ఉల్లంఘించడం ద్వారా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని, ఆయనపై క్రిమినల్ కోర్టు ధిక్కార చర్యల కోసం పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ అటార్నీ జనరల్ వెంకట రమణిని సుప్రీంకోర్టు లాయర్ బ్రజేష్ సింగ్ కోరారు.

More Stories
ఆయుష్మాన్ భారత్‌కు 8 ఏళ్లు.. 45.8 కోట్ల మందికి సేవలు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌తో రూ. 94,000 కోట్ల అక్రమార్జన
‘ఓట్ల చోరీ’ ఆరోపణలను తిరస్కరించిన బిజెపి