రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో భారత్ పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని, శిక్షార్హమైన టారిఫ్‌లువిధించవద్దని అమెరికాకు ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ జేపీ మోర్గాన్ చేజ్ సీఈఓ జేమీ డైమన్ సూచించారు. తొందరపడి ఏకపక్షంగా ముందుకెళ్తే అది కేవలం భారత్‌కే కాకుండా యావత్ ప్రపంచ చమురు మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ఈ విషయంలో పునరాలోచన చేయాలని సలహా ఇచ్చారు.
జెపీ మోర్గాన్ ఇండియా ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా ఓ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడుతూ రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న చమురుపై టారిఫ్‌లు విధించే ముందు అమెరికా ప్రభుత్వం క్షుణ్ణంగా ఆలోచించాలని హితవు చెప్పారు. భారత రిఫైనరీలు రష్యా చమురును ఎలా వినియోగిస్తున్నాయో, వాటి అవసరాలేమిటో వాషింగ్టన్ ముందుగా అర్థం చేసుకోవాలని హితవు పలికారు.
భారత్‌పై ఆంక్షలు విధించే బదులు అమెరికా అధికారులు ఢిల్లీతో కూర్చుని అన్ని వాస్తవాలను చర్చించాలని సూచించారు. ‘రష్యాతో పోరాడేందుకు చేయాల్సినవి చేస్తూనే భారత్‌ను, ప్రపంచ చమురు మార్కెట్లను శిక్షించకుండా అమెరికా వ్యవహరిస్తుందని నేను ఆశిస్తున్నా’ అని జేమీ డైమన్ పేర్కొన్నారు. చమురుపై టారిఫ్‌లు విధించడం సరైన నిర్ణయమా? కాదా..? అనే దానిపై తనకు పూర్తి స్పష్టత లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించేందుకు అధికారం కల్పిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ చట్టంపై సంతకం చేసిన నేపథ్యంలో డైమన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రష్యా నుంచి అత్యధికంగా ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఈ చట్టం అమల్లోకి వస్తే భారత్‌పై ప్రభావంపడే అవకాశం ఉంది.
భారత రిఫైనరీలు ప్రాసెస్ చేస్తున్న రష్యా చమురుకు ప్రత్యామ్నాయాలను అంత సులభంగా కనుగొనలేకపోవచ్చని డైమన్ గుర్తుచేశారు. సరఫరాలో ఆకస్మిక మార్పులుచేస్తే అది భారత రిఫైనరీలకే కాకుండా విస్తృత ఇంధన మార్కెట్లకు కూడా నష్టం కలిగిస్తుందని వివరించారు. అనూహ్య పరిణామాలకు దారితీసే చర్యల కంటే, వాస్తవాలపై చర్చలు జరపడం ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు.

More Stories
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌తో రూ. 94,000 కోట్ల అక్రమార్జన
పతంజలి నెయ్యిలో కల్తీ లేదు.. మందులపై నిషేధం అబద్ధం
చైనాకు ఐదు నెలల్లో 40 శాతం ఎగుమతుల వృద్ధి