దిగొచ్చిన సర్కార్.. జూరాలకు కుడి, ఎడమ కాలువకు నీటి విడుదల

సాగునీటి కోసం  వారం, పది రోజుల నుంచి గద్వాల, వనపర్తి జిల్లాల్లో రైతులు చేస్తున్న నిరవధిక ఆందోళనలతో రాష్ట్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. కాంగ్రెస్ సర్కార్ దిగి వచ్చి రైతులకు జూరాల రిజర్వాయర్ పంట కాలువలకు బుధవారం నీటిని విడుదల చేసింది.   పంట కాలువలకు నీటిని విడుదల చేయాలని గత వారం రోజులుగా జూరాల ఆయకట్టు రైతులు చేస్తున్న ఆందోళన రెండు రోజులుగా తీవ్రం కావడంతో ప్రతిపక్షాలు బిఆర్‌ఎస్, బిజెపి నాయకులు కూడా సంఘీభావం తెలిపారు.
దీంతో చేసేది లేక బుధవారం ఉదయం జూరాల కుడి, ఎడమ కాలువలతోపాటు సమాంతర కెనాల్‌కు సాగునీటిని విడుదల చేయడంతో రైతులు ఆనందంలో మునిగిపోయారు. 
జూరాల నీటిపై రాజకీయ ఒత్తిడి పెరుగుతున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం కర్ణాటకను ఆశ్రయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో ఫోన్‌లో మాట్లాడి నారాయణపూర్‌ జలాశయం నుంచి జూరాలకు నీటిని విడుదల చేయాలని కోరారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పంటలు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయని వివరించి సుమారు 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. 
 
శివకుమార్‌ సానుకూలంగా స్పందించినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి వాకిటి శ్రీహరితో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల బృందం బెంగళూరు వెళ్లి కర్ణాటక ముఖ్యమంత్రిని కలిసింది. అయితే, ఈ రాజకీయం కూడా రక్తికట్టకపోవడంతో వారు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు రాకముందే అధికార యంత్రాంగం ఆగమేఘాల మీద ప్రాజెక్టు కిందిస్థాయి సిబ్బందితో తూములను తెరిపించాల్సి వచ్చింది.

మరోవైపు జూరాల ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్న లిఫ్టులకు కూడా ఎత్తిపోస్తున్నది. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2,500 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. అవుట్‌ ఫ్లో మాత్రం 2,626 క్యూసెక్కులుగా ఉన్నది. కర్ణాటక నుంచి ప్రతిరోజు 7వేల క్యూసెక్కుల చొప్పున నెల రోజులపాటు విడుదల చేయాలని కర్ణాటక సీఎంను కోరామని, త్వరలో నీటి విడుదల ప్రారంభమవుతుందని మంత్రుల బృందం ప్రకటించింది.
 
ముఖ్యంగా బిజెపి నాయకులు పెద్ద ఎత్తున రైతులకు సంఘీభావం తెలిపి నీటిని విడుదల చేసేలా కృషి చేశారు. తాగునీటి అవసరాల మేరకే జూరాలలో నీళ్లు ఉన్నాయని అధికారులు చెప్పడంతో అన్నదాతలు కన్నెర్ర చేశారు. రైతులు చేపట్టిన ఆందోళనకు బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు మద్దతు తెలిపాయి. దీంతో రైతుల ఆందోళనలు మరింత ఉద్ధృతం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకవచ్చారు. 
 
ఈ క్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మేఘ రెడ్డి మధుసూదన్ రెడ్డిలు విషయాన్నికర్ణాటక ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి కర్ణాటకకు వెళ్లారు. 
 
కర్ణాటక ప్రభుత్వం కూడా నీటి నిడుదల చేసేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో నీటి విడుదలకు మార్గం సుగమమైంది. ఇదిలా ఉండగా ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులోకి 2,687 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో అధికార యంత్రాంగం హుటాహుటిన కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేసింది. బుధవారం ఉదయం 8 గంటలకు కూడి, ఎడమ కాలువల వద్దకు చేరుకున్న అధికారులు తూములను తెరిచి కిందికి నీళ్లను వదిలిపెట్టారు. 
 
ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు 2,687 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఈ ఇన్‌ఫ్లోను ఇలాగే ఒడిసి పడితే పూర్తిస్థాయిలో నిండి ఏకంగా స్పిల్ గేట్లను తెరవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదే జరిగితే మళ్లీ కిందికి నీళ్లు వెళతాయి. రైతాంగం ఆగ్రహం మరింత పెళ్లుబికుతుందని భయపడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం హుటాహుటిన కుడి, ఎడమ కాలువలకు నీటి విడుదల చేయాలని అధికారులు కోరినా  పట్టించుకోకపోవడంతో చివరకు అధికార యంత్రాంగమే కుడి, ఎడమ కాలువలకు నీళ్లు విడుదల చేయడం గమనార్హం. 
 
మరోవైపు జూరాల ప్రాజెక్టుకు సాగు, తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని కోరుతూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి డికె శివకుమార్‌ను కలిశారు. జూరాల ఆయకట్టు రైతుల సాగునీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.30 రోజులపాటు రోజుకు 5 వేల క్యూసెక్కుల చొప్పున మొత్తం 7 టిఎంసిల నీటిని జూరాల ప్రాజెక్టుకు విడుదల చేస్తామని కర్ణాటక సిఎం డికె శివకుమార్ హామీ ఇచ్చినట్లు ప్రజాప్రతినిధులు తెలిపారు.

 

About The Author