అయోధ్యలోని రామమందిరంలో విరాళాల చోరీకి సంబంధించిన 105 ఘటనలు ఆలయ సిసిటివి కెమెరాల్లో రికార్డయ్యాయని సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. విరాళాల చోరీపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదికను ఉటంకిస్తూ, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దర్యాప్తు వివరాలను అత్యున్నత న్యాయస్థానానికి వివరించారు. సిట్ దర్యాప్తు తుది దశకు చేరుకుందని, సెప్టెంబర్ 25 నాటికి ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నట్లు కూడా సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు.
ఛార్జ్ షీట్‌పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోర్టు మేజిస్ట్రేట్‌ను ఆదేశించింది. విరాళాల చోరీ ఆరోపణలకు సంబంధించిన కేసును విచారిస్తున్న సమయంలో సుప్రీంకోర్టు సిట్ సమర్పించిన తాజా నివేదికను (స్టేటస్ రిపోర్ట్) పరిశీలించింది. విచారణ సందర్భంగా, ఇప్పటివరకు జరిగిన అరెస్టులు, సేకరించిన సాక్ష్యాధారాల గురించి కోర్టుకు సమాచారం అందించారు. లభ్యమైన సాక్ష్యాలను కూడా కోర్టు ముందు ఉంచారు.
సిసిటివి ఫుటేజ్, సాక్షుల వాంగ్మూలాలు మరియు ఇతర సాక్ష్యాలకు సంబంధించిన వివరాలను కూడా పంచుకున్నారు. నిందితులను గుర్తించడానికి సిసిటివి ఫుటేజ్, ఇతర అంశాలను ఎలా విశ్లేషించారో ఆ నివేదికలో వివరించారు. అందించిన సమాచారాన్ని సుప్రీంకోర్టు రికార్డులోకి తీసుకుంది. విలువైన వస్తువులకు సాఫ్ట్వేర్ ద్వారా రశీదులు జారీ చేస్తామనిని, ఆ వస్తువులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాకర్లో భద్రపరుస్తారని కూడా నివేదికలో పేర్కొన్నారు.
విచారణ సమయంలో, పిటిషనర్లు సిట్ నివేదిక కాపీని కోరారు. కానీ సుప్రీంకోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. ఈ వ్యవహారాన్ని సెషన్స్ జడ్జి పరిధి నుండి బయటకు తీసుకురావడం తమకు ఇష్టం లేదని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అలాగే తదుపరి దర్యాప్తు అవసరమని భావిస్తే తాము తగిన ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది.
ఈ ఏడాది ప్రారంభంలో విరాళాల చోరీ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత, రామమందిర ట్రస్ట్ అగ్రశ్రేణి అధికారులు చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలను వారి పదవుల నుండి తొలగించారు. అంతేకాకుండా, ట్రస్ట్‌లో సీఈఓ నేతృత్వంలోని పరిపాలనా వ్యవస్థను అమలు చేశారు. మాజీ సైనికాధికారి జితేంద్ర మిశ్రాను సీఈఓగా నియమించారు. వ్యవస్థలో మార్పులు చేస్తామని, భవిష్యత్తు కార్యకలాపాలు గతంతో పోలిస్తే మెరుగ్గా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకముందే, ట్రస్ట్ అభ్యర్థన మేరకు రాష్ట్ర ప్రభుత్వం జూన్ 13న లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల సిట్ ని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ జూన్ 23న రాష్ట్ర ప్రభుత్వానికి తన ప్రాథమిక నివేదికను సమర్పించి, అనేక కఠినమైన సిఫార్సులను చేసింది.

More Stories
ఇరాన్ యుద్ధంతో అదుపు తప్పుతున్న ఆహార ధరల ద్రవ్యోల్బణం
ఎల్పీజీ సబ్సిడీకి ఆధార్ తప్పనిసరి
భారీగా తగ్గనున్న మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు!