మమతా మద్దతు తర్వాత కాంగ్రెస్ నందిగ్రామ్ అభ్యర్థి అరెస్ట్‌

మమతా మద్దతు తర్వాత కాంగ్రెస్ నందిగ్రామ్ అభ్యర్థి అరెస్ట్‌

పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌కు తమ వర్గం మద్దతు ఇస్తుందని మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించిన కొన్ని గంటల్లోనే పాత కేసులో కాంగ్రెస్‌ అభ్యర్థిని పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు.  భూసేకరణకు వ్యతిరేకంగా 2007లో నందిగ్రామ్‌లో చేపట్టిన ఆందోళనలకు సంబంధించిన కేసులో మిలాన్‌ను పోలీసులు అరెస్టు చేశారని కాంగ్రెస్‌ ప్రకటించింది. 2007లో జరిగిన ఆందోళనల్లో 14మంది మరణించారు.

అక్టోబర్‌ 6న జరుగనున్న నందిగ్రామ్‌ ఉప ఎన్నికల్లో మమతా బెనర్జీ పోటీ చేయవచ్చన్న ఊహాగానాలు తొలుత వెల్లువెత్తాయి. అయితే ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం ఆరోపణలకు సంబంధించి 26,000 మంది టీచర్ల నియామకాలను రద్దు చేయడంతో ఉద్యోగాన్ని కోల్పోయిన నందిగ్రామ్‌కు చెందిన ఉపాధ్యాయురాలు సంచితా ప్రధాన్ డేను తమ అభ్యర్థిగా మమతా నేతృత్వంలోని టీఎంసీ వర్గం ప్రకటించింది. 

రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఉన్న నందిగ్రామ్ స్థానం నుంచి పోటీకి దిగిన ఆ అభ్యర్థిని షాక్‌ ఇచ్చారు.  నందిగ్రామ్ నుంచి మమతా వర్గం తరఫున బరిలోకి దిగిన సంచిత ప్రధాన్ దేవ్ తన భర్త సత్యజిత్‌తో కలిసి బంగాల్‌ సచివాలయం ‘నబన్న’కు వెళ్లారు. అక్కడ సీఎం సువేందు అధికారితో భేటీ అయ్యారు. సమావేశం ముగిసిన వెంటనే  నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడానికి ఒక్క రోజు ముందు ఆమె తన నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకున్నారు.

నామినేషన్‌ దాఖలు గడువు ఇప్పటికే పూర్తవ్వగా మమత మరొకరిని బరిలోకి దించే అవకాశం లేకపోయింది. దీంతో కాంగ్రెస్‌ అభ్యర్థికి తమ మద్దతు ప్రకటిస్తున్నామని మమత శుక్రవారం ప్రకటించారు.  బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.  “మేము పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం. భారతదేశం నుంచి బీజేపీ వెళ్లిపోవాలని నేను కోరుకుంటున్నా. మా పూర్తి సంఘీభావం ఇండియా కూటమికే. ఇండియా కూటమిని బలోపేతం చేసే సందేశం బెంగాల్ నుంచే మొదలవ్వాలి” అని మీడియాతో పేర్కొన్నారు.

అలాగే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గురువారం తనకు ఫోన్ చేశారని, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇండియా కూటమికి మద్దతు సందేశాన్ని పోస్ట్ చేసినట్లు మమతా బెనర్జీ వివరించారు.  ప్రతిపక్షాలను అంతం చేసేందుకు బీజేపీ చేసిన కుట్ర ఇదని మమతా ఆరోపించారు. మహారాష్ట్రలో శివసేనను ముక్కలు చేసిన బీజేపీ ఇప్పుడు టీఎంసీ విషయంలో కుట్రలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. బీజేపీని దేశం నుంచి తరిమికొట్టడమే లక్ష్యంగా ఇండియా కూటమితో కలిసి పని చేస్తానని మమత స్పష్టం చేశారు.