మమత పార్టీకి కొత్త ఎన్నికల గుర్తు

మమత పార్టీకి కొత్త ఎన్నికల గుర్తు

తృణమూల్‌ కాంగ్రెస్‌ రెండు వర్గాలకు ఎన్నికల సంఘం(ఈసీ) కొత్త పార్టీ పేర్లు, గుర్తులను ఖరారు చేసింది. మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని వర్గానికి ‘మమతా ఆల్‌ ఇండియా తృణమూల్‌ కాంగ్రెస్‌’ పేరు, ‘ఫుట్‌బాల్‌ ప్లేయర్‌’ గుర్తు దక్కాయి. అరూపరాయ్‌ అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న మరో వర్గానికి (రితబ్రత బెనర్జీ ఆధ్వర్యంలో ఏర్పడిన చీలిక వర్గం) ‘డెమొక్రటిక్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌’ పేరు, ‘ఎన్వలప్‌’ (కవర్‌) గుర్తులను కేటాయిస్తూ ఈసీ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. 

దీంతో అక్టోబర్‌ 6న తూర్పు మిడ్నాపూర్‌ జిల్లాలోని నందిగ్రామ్‌, ముర్షీదాబాద్‌ జిల్లాలోని రెజినగర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగే ఉప ఎన్నికల్లో ఈ రెండూ కొత్త పేర్లు, గుర్తులపై తలపడనున్నాయి. అంతకుముందు గురువారం రాత్రి ఈసీ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల్లో ‘ఆల్‌ ఇండియా తృణమూల్‌ కాంగ్రెస్‌’ పేరు, అధికారిక గుర్తును (పూలు-గడ్డి) ఎవరూ ఉపయోగించుకోకుండా ఫ్రీజ్‌ చేయడం తెలిసిందే.

 రానున్న ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ మధ్యంతర ఏర్పాట్లు చేసినట్లు ఈసీ వివరించింది. పార్టీ పేరు, గుర్తులపై తుది నిర్ణయం తీసుకునేంత వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఇప్పటికే ఆయా స్థానాలకు బరిలో దిగిన వారిని ఆయా కొత్త పార్టీల అభ్యర్థులుగా పరిగణించాలని రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించింది. 

దీనిపై మమత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో టీఎంసీలో చీలిక ఏర్పడడం తెలిసిందే. ఈ రెండు వర్గాలు టీఎంసీ పేరు, పూలు-గడ్డి గుర్తు తమవే అని వాదిస్తున్నాయి. కొత్త గుర్తుల ఏర్పాటుపై మమతా వర్గానికి చెందిన ఎమ్మెల్యే కునాల్‌ ఘోష్‌ స్పందిస్తూ.. ఫుట్‌బాల్‌ ఆట దుస్తులను ధరించి, బంతితో ఉన్న ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘ఆట మొదలైంది’ అని సంకేతం ఇచ్చారు.