మతం మారితేనే వైసీపీలో పదవులు 

మతం మారితేనే వైసీపీలో పదవులు 
 
వైసీపీలో ఒకప్పుడు నంబర్-2గా చక్రం తిప్పి, అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి నీడలా ఉన్న మాజీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి ఇప్పుడు అదే జగన్‌ను  ఉక్కిరిబిక్కిరి చేసేలా అత్యంత సున్నితమైన, వివాదాస్పద అస్త్రాన్ని బయటకు తీశారు.  కేవలం సాధారణ రాజకీయ విమర్శలతో సరిపెట్టకుండా, నేరుగా మతమార్పిళ్లు అనే సంచలన అంశాన్ని తెరపైకి తెచ్చారు.  గత ఐదేళ్ల వైసీపీ పాలనలో మత మార్పిడి కార్యక్రమాలు  పెద్దఎత్తున వ్యూహాత్మకంగా సాగాయనే ఆరోపణలు గట్టిగా వినిపించాయి.
కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వంటి నేతలు బహిరంగ సభల్లోనే పాస్టర్లను వెనుకేసుకురావడం, క్రైస్తవ ముఖ్యమంత్రి మళ్లీ రావాలంటూ ప్రార్థనలు చేయించడం అప్పట్లో తెగ వైరల్ అయింది.  గుంటూరు జిల్లా తెనాలి సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా బాప్టిజం ఘాట్ల నిర్మాణం చేపట్టడం, స్థానికులు కోర్టును ఆశ్రయించడం వంటి పరిణామాలు ఇప్పటికీ ప్రజల మదిలో ఇంకా మెదులుతూనే ఉన్నాయి.
ఇక సోషల్ మీడియాలో, పార్టీ అధికార పత్రిక సాక్షి వేదికగా కూడా మేధావులతో ప్రత్యేక వ్యాసాలు రాయించి మతమార్పిళ్లకు ఒక సిద్ధాంత రూపం కూడా తీసుకువచ్చారనే చర్చ నడుస్తోంది. ఈ మతపరమైన ఎత్తుగడలు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితం కాలేదని, వైసీపీలో పదవులు దక్కించుకోవడానికి కూడా ప్రధాన మార్గంగా మారాయన్నదే ఇప్పుడు విజయసాయిరెడ్డి వెల్లడించడం కలకలం రేపుతోంది.
జగన్ మెప్పు పొందాలన్నా, ఎమ్మెల్యే టికెట్లు, మంత్రి పదవులు దక్కించుకోవాలన్నా కొందరు ముఖ్య నేతలు తమ సొంత సాంప్రదాయాలను పక్కనపెట్టి మతం మారే స్థాయికి దిగజారారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.  జోగి రమేష్ వంటి సీనియర్ నేతల పేర్లను ముడిపెట్టి జరుగుతున్న ఈ చర్చలో ఇలా అధికారం కోసం తమ విశ్వాసాలను తాకట్టు పెట్టిన నేతల జాబితా చాలా పెద్దగానే ఉందని విజయసాయిరెడ్డి పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు.
ఇదే అంశంపై మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి గతంలో మాట్లాడిన వివాదాస్పద వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు.  టికెట్ల కోసం, మంత్రి పదవుల కోసం ఎంతమంది నాయకులు మతం మార్చుకున్నారో వైసీపీ నంబర్ వన్ సమాధానం చెప్పాలి అంటూ ఆయన సంధించిన సూటి ప్రశ్న ఆ పార్టీ శిబిరంలో గుబులు పుట్టిస్తోంది. త్వరలోనే పూర్తి ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టి మరిన్ని సంచలన విషయాలు బయటపెట్టేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.