కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 767 ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణ పనులకు రూ.908 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 6,254 ఆలయాల్లో ధూప, దీప, నైవేద్య పథకాన్ని అమలు చేస్తున్నామని, ఇందుకోసం ఏటా సుమారు రూ.75 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 5 వేల భజన మందిరాలను నిర్మించాలనే లక్ష్యంతో శ్రీ వాణి ట్రస్ట్ ద్వారా సుమారు రూ.750 కోట్లను కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే 1,788 భజన మందిరాల నిర్మాణానికి రూ.609 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు వెల్లడించారు.
2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. పుష్కరాల నిర్వహణకు రూ.87 కోట్ల అంచనా వ్యయంతో 375 ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 996 ఆలయాలకు ట్రస్ట్ బోర్డులను నియమించినట్లు మంత్రి తెలిపారు. మరో 404 ఆలయాలకు ట్రస్ట్ బోర్డుల నియామక ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు.
రాష్ట్రంలోని 111 దేవాలయాల్లో అన్నప్రసాద వితరణ కార్యక్రమం కొనసాగుతోందని ఆనం తెలిపారు. ఇందులో 65 ఆలయాల్లో నిత్యాన్నదానం అమలు చేస్తున్నట్లు చెప్పారు. రోజుకు సుమారు 80 వేల మంది, నెలకు 24 లక్షల మంది, ఏడాదికి సుమారు 3 కోట్ల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ.158 కోట్లను ఖర్చు చేస్తోందని వివరించారు.
రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు భక్తుల రద్దీ గణనీయంగా పెరుగుతోందని చెబుతూ 2026 మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాలను ఒక్కరోజులోనే సుమారు 24.75 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని తెలిపారు. 2025 నవదుర్గి ఉత్సవాల్లో దుర్గమ్మవారిని సుమారు 16 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని చెప్పారు. తిరుమలలో గత వేసవిలో ఒక్కరోజులోనే 90 వేల మందికి పైగా భక్తులకు స్వామివారి దర్శనం కల్పించినట్లు తెలిపారు.
More Stories
సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు
యూట్యూబర్ నందనని నాలుగు గంటల విచారణ
లండన్ జాబ్స్ పేరిట ఘరానా మోసం.. యూట్యూబర్ నందన అరెస్ట్