
పిఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 50వ రాకెట్‌ను ఇస్రో విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టింది. శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి మధ్యాహ్నం 3.41 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ50 రాకెట్‌ను ప్రయోగించింది. ఈ వాహక నౌక ద్వారా కమ్యూనికేషన్ శాటిలైట్ వ్యవస్థ సీఎంఎస్–01ను అంతరిక్షంలోకి పంపించింది. ఇది సీ-బ్యాండ్ సేవల విస్తరణకు సీఎంఎస్-01 దోహదపడనుంది. ఈ రాకెట్ ప్రయోగానికి బుధవారం మధ్యాహ్నం 2.41 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.
20.11 నిమిషాల్లో కక్ష్యలోకి ఉపగ్రహాన్ని విడిచిపెట్టేలా ఏర్పాట్లు చేశారు. 1,410 కిలోల బరువు కలిగిన 42వ దేశీయ కమ్యూనికేషన్ ఉపగ్రహం సీఎంఎస్-01ను ఈ రాకెట్ జియో స్టేషనరీ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (జీటీవో)లోకి చేరవేయనుంది. 2011లో ప్రయోగించిన జీశాట్-12 కాలపరిమితి ముగిసిపోవడంతో దానిస్థానంలో జీశాట్-12ఆర్ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టాలని ఇస్రో నిర్ణయించింది. అయితే ప్రస్తుతం దాని పేరును సీఎంఎస్-01గా మార్చి కక్ష్యలోకి చేరవేస్తున్నారు.
ఈ రాకెట్ 44.4 మీ ఎత్తు ఉండగా, 2.8 మీటర్ల వ్యాసం ఉన్నది. 320 టన్నుల బరువున్న ఈ వాహక నౌక నాలుగు దశల్లో అంతరిక్షంలోకి చేరుతుంది. అదేవిధంగా భూబదిలీ కక్ష్యలోకి 1,425 కిలోలు, సూర్యానువర్తన కక్ష్యలోకి 1750 కిలోల బరువును మోసుకెళ్లగలుగుతుంది.
2011లో పంపిన జీశాట్-12 ఉపగ్రహ జీవిత కాలం పూర్తి కావడంతో దాని స్థానంలో సేవలందించేందుకు సిఎంఎస్–1ను పంపించారు. ఇది సీ బ్యాండ్ లో టెలికాం సేవలందిస్తుంది. సీ బ్యాండ్ తో భారతదేశ ప్రధాన భూభాగంతో పాటు అండమాన్ నికోబార్, లక్షద్వీప్ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు విస్తృతం కానున్నాయి.
రెండు టన్నులకు మించి బరువు కలిగిన అతి పెద్ద ఉపగ్రహాలను ఫ్రాన్స్, రష్యా అంతరిక్ష సంస్థల నుంచి ఇస్రో పంపిస్తోంది. అతి చిన్న విదేశీ ఉపగ్రహాలను పీఎస్ఎల్విల ద్వారా ప్రయోగించి వాణిజ్యపరంగా ఇస్రోకు ఆదాయాన్ని తీసుకొచ్చేదిగా మారింది.
చంద్రయాన్, మంగళ్‌యాన్ లాంటి గ్రహాంతర ప్రయోగాలు, ఒకేసారి పది ఉపగ్రహాలు, 20 ఉపగ్రహాలు, ఆ తర్వాత 104, మళ్లీ 38 ఉపగ్రహాలను సునాయాసంగా మోసుకెళ్లి అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టగలిగిన ఘనత పీఎస్ఎల్వి సొంతం. ఇప్పటి వరకు 51 రాకెట్లను ప్రయోగించగా అందులో రెండు మాత్రమే విఫలమయ్యాయి. గురువారం నాటి ప్రయోగంతో మరో కీలక ఘట్టానికి షార్ వేదికైంది.
More Stories
పంటలకు జీవ ఉత్ప్రేరకాలఅమ్మకంపై నిషేధం
భారత్ అమ్ములపొదిలో చేరనున్న ధ్వని మిస్సైల్
బీజాపూర్ లో 103 మంది మావోయిస్టుల లొంగుబాటు