ప్రధాని చిన్ననాటి స్నేహితుడికి భూమిచ్చేసిన బీజేపీ ఎమ్మెల్యే

ప్రధాని చిన్ననాటి స్నేహితుడికి భూమిచ్చేసిన బీజేపీ ఎమ్మెల్యే
మహారాష్ట్రలోని మీరా-భయాందర్ ప్రాంతంలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఒక సంచలనాత్మక భూవివాదానికి ఎట్టకేలకు ఓ ముగింపు లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ చిన్ననాటి పాఠశాల స్నేహితుడైన 81 సంవత్సరాల అస్గర్ అలీ వోహ్రా స్వయంగా ప్రధానిని కలవడంతో, వెంటనే రంగంలోకి దిగిన అధికారులు, బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతాతో మాట్లాడి వివాద పరిష్కారానికి మార్గం సుగమం చేశారు.
 
దీంతో సదరు వివాదాస్పద ప్లాట్‌పై తమకున్న స్వాధీన హక్కులను వదులుకుంటున్నట్లు ప్రకటించిన మెహతా నిర్మాణ అనుమతులను టౌన్ ప్లానింగ్ విభాగానికి వెనక్కి ఇచ్చేశారు. ఇరువర్గాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం వోహ్రాపై గతంలో చేసిన పోలీసు ఫిర్యాదును సైతం ఉపసంహరించుకున్నారు.  గుజరాత్‌లోని వాద్‌నగర్ బి.ఎన్. స్కూల్‌లో ప్రధాని మోదీతో కలిసి విద్యాభ్యాసం చేసిన వోహ్రా 1989లో భయాందర్ ఈస్ట్‌లోని నవ్‌ఘర్ ప్రాంతంలో సుమారు 2,810 చదరపు మీటర్ల భూమిని రిజిస్టర్డ్ ఒప్పందం ద్వారా కొనుగోలు చేశారు.
ఆ స్థలాన్ని తాను ఎవరికీ విక్రయించకపోయినప్పటికీ.. 2011లో నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్‌ను తన ప్రమేయం లేకుండానే రెండు భాగాలుగా విభజించారని వోహ్రా ఆరోపించారు. అందులో ఒక భాగాన్ని ‘స్వయం బిల్డర్స్’, మరో భాగాన్ని నరేంద్ర మెహతాకు చెందిన ‘సెవెన్ ఎలెవన్ కన్స్ట్రక్షన్స్’ ఆక్రమించుకున్నాయని ఆయన తెలిపారు.  అసలైన యజమాని అనుమతి లేకపోయినా మీరా-భయాందర్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగం నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కార్పొరేషన్, రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడం, 2015లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి సీఐడీ నివేదిక రావడానికి ఏకంగా ఈ ఏడాది వరకు నిరీక్షించాల్సి రావడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో విసిగిపోయిన వోహ్రా సెప్టెంబర్ 8న నేరుగా ప్రధాని మోదీని కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. నకిలీ పత్రాల సృష్టి, అధికారులు, బిల్డర్ల కుమ్మక్కుపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రధాని దృష్టికి విషయం వెళ్లడంతో మహారాష్ట్ర ఉన్నతాధికారులు వేగంగా స్పందించారు. ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీకర్ పరదేశి నేతృత్వంలో రాష్ట్ర సచివాలయంలో ఒక ప్రత్యేక భేటీ నిర్వహించారు.  ఈ సమావేశానికి అస్గర్ వోహ్రా, నరేంద్ర మెహతాతో పాటు మున్సిపల్ కమిషనర్ రాధా వినోద్ శర్మ, టౌన్ ప్లానర్ పురుషోత్తమ్ షిండే హాజరయ్యారు. ఈ సందర్భంగా మెహతా స్పందిస్తూ 2019లో మెర్విన్ ఫెర్నాండెజ్ అనే వ్యక్తి నుంచి ఈ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు చెబుతూ, ఇకపై ఈ భూమిపై ఎలాంటి హక్కులు కోరడం లేదని లేఖ సమర్పించారు. పోలీసు కేసును కూడా ఉపసంహరించుకోవడంతో దశాబ్దాల కాలంగా నలుగుతున్న భూవివాదం  ముగిసింది.