సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ డెడ్‌లైన్

సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ డెడ్‌లైన్
సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్‌ కుమార్ డెడ్‌లైన్‌ విధించారు. కాళీమాత ఆలయ ఘటనపై 24 గంటల్లో సీఎం, డీజీపీ మహేందర్‌రెడ్డి స్పందించాలని డిమాండ్‌ చేశారు. సీఎం స్పందించకపోతే ఉద్యమం తప్పదని సంజయ్‌ హెచ్చరించారు. 
 
పాతబస్తీలో బీజేపీ చేపట్టబోయే ఉద్యమానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. హిందువో, బొందువో సీఎం కేసీఆరే తేల్చుకోవాలని వారించారు. తమ సహనం నశిస్తే పాతబస్తీ ఏమవుతోందో పోలీసులు గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. కాషాయ వస్త్రాలు ధరించిన మాత్రాన కేసీఆర్ హిందువు కాలేడని చెప్పారు. 
 
కాళీమాత భూముల కబ్జాకు సహకరించిన డీసీపీని వెంటనే సస్పెండ్ చేయాలని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన త‌మ పార్టీ కార్యకర్తలను విడిపించుకునేందుకు డబీర్ పూర పోలీసు స్టేషన్ కు వెళ్తుంటే చిటికెలు వేస్తూ త‌న‌ను పోలీస్ స్టేషన్ కు వెళ్ళనీయమని చెప్పాడ‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
మహిళలపై డీసీపీ దాడులకు దిగడాన్ని ఖండిస్తున్నామని ప్రకటించారు. ఎంఐఎం కార్యకర్తలకు డీసీపీ వత్తాసు పలుకుతున్నారని సంజయ్‌ ఆరోపించారు.  అంతకుముందు కాళీమాత దేవాలయం భూములపై వివాదం చోటుచేసుకుంది. సర్వేనెంబర్‌ 24, 25, 26లో ఏడు ఎకరాల 13 గుంటల భూమిపై ఘర్షణ నెలకొంది. ప్రహరీ నిర్మాణాలను స్థానికులు, బీజేపీ నేతలు అడ్డుకున్నారు. 
 
1951 నుంచి దేవాదాయశాఖ ఆధీనంలో భూమి ఉంది. ఆలయట్రస్ట్‌ తనకు భూమి అమ్మిందంటూ ఓ వ్యక్తి నిర్మాణాలు మొదలుపెట్టారు. పోలీసుల సాయంతో ఆలయస్థలంలో ఆ వ్యక్తి నిర్మాణాలు చేపట్టాడు. స్థానికులకు మద్దతుగా ఎమ్మెల్యే రాజా సింగ్‌ ఆలయానికి వచ్చారు. అలాగే  కాళీమాత దేవాలయానికి బండి సంజయ్‌ వెళ్లారు.
 
 కాగా, మత కలహాలు సృష్టించి నెపాన్ని బీజేపీపై వేయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారని బిజెపి  ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆరోపించారు. కాళీమాత భూముల కబ్జా వెనుక డీసీపీ ప్రమేయం ఉందని చెప్పారు. హైకోర్టు ఆర్డర్‌ను కాదని డీసీపీ కింది కోర్ట్ ఆర్డర్‌ను.. అమలు చేయటానికి ప్రయత్నించారని మండిపడ్డారు. 
 
పాతబస్తీలో మత కలహాలు సృష్టించాలని, పోలీసులే ప్రయత్నించారని ఆరోపించారు. ఎంపీ బండి సంజయ్‌పై ఎంఐఎం గూండాలు దాడికి ప్రయత్నించారని, బీజేపీ కార్యకర్తలే కాళీమాత ఆలయం భూమి‌ని కాపాడారని రాజాసింగ్‌ తెలిపారు. కాళీమాత ఆలయాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రాజాసింగ్‌ ఆరోపించారు. దేవాలయం భూములు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఎండోమెంట్‌ అధికారుల నిర్లక్ష్యంతోనే ఆలయభూములు కబ్జా చేశారని రాజాసింగ్‌ మండిపడ్డారు.