చిన్నారుల‌పై లైంగిక వేధింపుల సమాచారం ఇచ్చేందుకు మెటా అంగీకారం

చిన్నారుల‌పై లైంగిక వేధింపుల సమాచారం ఇచ్చేందుకు మెటా అంగీకారం
సామాజిక మాధ్యమాల్లో బాలలపై లైంగిక వేధింపులకు స్వస్తి పలికేందుకు ప్రముఖ టెక్ సంస్థ ‘మెటా’ కీలక ముందడుగు వేసింది. చిన్నారులపై జరుగుతున్న ఆన్‌లైన్ వేధింపులు, చట్టవిరుద్ధమైన కంటెంట్‌కు సంబంధించిన కేసుల వివరాలను భారత దర్యాప్తు సంస్థలకు నేరుగా అందించేందుకు అంగీకరించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 
చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, భారత్‌లో బాలలపై లైంగిక వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సమర్పించే విజ్ఞప్తులకు పూర్తిగా సహకరిస్తామని మెటా తెలిపింది.
ఇకపై పిల్లల భద్రతకు సంబంధించిన ఫిర్యాదులు, ఆధారాలను ‘ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్’ (I4సి) నిర్వహిస్తున్న పోర్టల్‌కు మెటా నేరుగా చేరవేస్తుంది.  ప్లాట్‌ఫామ్‌లలో హానికరమైన కంటెంట్‌ వ్యాప్తి చెందకముందే గుర్తించి తొలగించేలా ఇతర సోషల్ మీడియా సంస్థలతో కూడా కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. చిన్న పిల్ల‌ల విష‌యంలో ఆన్‌లైన్ భద్రత అనేది సోష‌ల్ మీడియా సంస్థ‌ల ప్రాథ‌మిక సూత్రం అని, భారత్ కేంద్రంగా ప‌ని చేసే ప్ర‌తి సోష‌ల్ మీడియా సంస్థ దీన్ని పాటించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది.
సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫాంల‌లో ఎలాంటి వేధింపులు, అభ్యంత‌ర‌క‌ర కంటెంట్ ఉండ‌కుండా, సుర‌క్షితంగా ఉండేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది. దీనిలో భాగంగా కొద్ది రోజుల క్రితం మెటాకు ప్ర‌భుత్వం నోటీసులు కూడా జారీ చేసింది. చివ‌ర‌కు త‌మ త‌ప్పుపై మెటా ఇటీవ‌ల క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పింది.  ఈ విష‌యంలో ఎలాంటి మిన‌హాయింపులు లేవ‌ని స్ప‌ష్టం చేసింది. 
ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ ప్రకటనల్లో బాలల లైంగిక వేధింపులకు సంబంధించిన మెటీరియల్స్ ప్రసారమయ్యాయని బీబీసీ కథనం ప్రచురించింది. ఈ కథనం ఆధారంగా నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సిపిసిఆర్) మరియు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సి) తీవ్రంగా స్పందించాయి. జులైలో నోటీసులు ఇచ్చిన అనంతరం, సెప్టెంబర్ 9న మెటా ప్రతినిధులు కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చారు.

ఎన్ హెచ్ ఆర్ సి  సభ్యుడు ప్రియాంక్ కనూంగో మాట్లాడుతూ, పోక్సో చట్టాన్ని ఉల్లంఘించే విధంగా ఉన్న కంటెంట్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎనిమిది రాష్ట్రాల డీజీపీలకు కూడా దీనిపై ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మెటా గ్లోబల్ అఫైర్స్ హెడ్ జోయెల్ కప్లన్ బృందం భేటీ అయి డీప్‌ఫేక్‌లు, బోట్ అకౌంట్లు, బాలల వేధింపుల నిరోధానికి తీసుకుంటున్న చర్యలను వివరించింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో పిల్లలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించని సంస్థలపై కఠిన చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వం మరోసారి హెచ్చరించింది.