మరో 25 ఏళ్లల్లో అమెరికాను అధిగమించనున్న భారత్

మరో 25 ఏళ్లల్లో అమెరికాను అధిగమించనున్న భారత్
 
రాబోయే 25 ఏళ్లలో భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త,  కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జెఫ్రీ సాచ్స్ సంచలన అంచనా వేశారు. ప్రపంచ ఆర్థిక దిశ ప్రస్తుతం ఆసియా వైపు వేగంగా మారుతోందని ఆయన విశ్లేషించారు. ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్రాలుగా చైనా, భారత్ నిలవబోతున్నాయని, ఈ క్రమంలో ప్రస్తుతం మొదటి స్థానంలో ఉన్న అమెరికా మూడో స్థానానికి పడిపోతుందని ఆయన స్పష్టం చేశారు. 
 
వేగవంతమైన ఆర్థిక వృద్ధి, సాంకేతిక పురోగతి, మానవ వనరుల లభ్యత భారత్‌ను ప్రపంచ ఆర్థిక రేసులో ముందుంజలో నిలబెడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రెండో స్థానానికి చేరడమే కాకుండా, తదనంతర కాలంలో చైనాను కూడా వెనక్కి నెట్టి భారత్ ప్రపంచంలోనే అత్యంత బలమైన అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని జెఫ్రీ సాచ్స్ జోస్యం చెప్పారు. పాశ్చాత్య దేశాల ఆధిపత్యం తగ్గి, ఆసియా దేశాల ప్రాబల్యం పెరుగుతుందనేందుకు ఈ పరిణామాలు నిదర్శనమని అభిప్రాయపడ్డారు.  ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న భారీ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఇప్పటికే ముందుందని చెప్పారు. చైనాతో సాంకేతిక, ఆర్థిక రంగాల్లో సహకారం పెరిగితే భారత దేశ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో యువ జనాభా అధికంగా ఉండటం దేశానికి ప్రయోజనకరమని కూడా చెప్పారు.

భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక బంధం ప్రపంచంలోనే అతిముఖ్యమైనదని పేర్కొంటూ ఇరు దేశాల మధ్య సహకారం ప్రపంచవ్యాప్తంగా సానుకూల ప్రభావం చూపిస్తుందని చెప్పారు. అయితే, ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు, విశ్వాస లోపం ఉందని కూడా ఆయన అంగీకరించారు. వీటిని పరిష్కరించుకోగలిగితే కలిగే ప్రయోజనాలు అధికమని వివరించారు. 

చైనాకు భారత్ అవసరం ఎంత ఉందో భారత్‌కు చైనా అవసరం కూడా అంతే ఉందని స్పష్టం చేశారు. చైనా సాంకేతికత, జాయింట్ వెంచర్లతో భారత్ ఆర్థికంగా మరింత విస్తరిస్తుందని చెప్పారు. చైనాతో ఆర్థికబంధం బలోపేతమైతే పాక్‌ విషయంలో భారత్‌కు ఉన్న కొన్ని ఆందోళనలు తొలగిపోతాయని చెప్పారు. భవిష్యత్తులో గ్లోబల్ ట్రేడ్, పెట్టుబడులు, ఆర్థిక విధానాలను నిర్దేశించడంలో భారత్ కీలక పాత్ర పోషించనుందని, ఇది ప్రపంచ వేదికపై దేశ స్థానాన్ని మరింత సమర్థవంతంగా బలపరుస్తుందని వివరించారు.

తాజా బ్రిక్స్ సమావేశంను ప్రస్తావిస్తూ బహుళ ధ్రువ ప్రపంచానికి రక్షణగా బ్రిక్స్ కూటమి ఉండాలని, కేవలం పాశ్చాత్య వ్యతిరేక గ్రూప్‌గా మిగిలిపోకూడదని ఆయన సూచించారు. ఇప్పటికే బహుళ ధ్రువ ప్రపంచం ఏర్పడిందని, ఈ వాస్తవాన్ని అంతర్జాతీయ సంస్థలు, వ్యవస్థలు ప్రతిబింబించాలని అభిప్రాయపడ్డారు. 

విదేశాంగ విధానంలో వాషింగ్టన్ డాలర్‌ను ఉపయోగించడాన్ని సాక్స్ విమర్శించారు. ఇరాన్‌తో వ్యాపారం కొనసాగిస్తున్న దేశాలపై అమెరికా వాస్తవంగా ఆర్థిక యుద్ధం ప్రకటించిందని ఆయన చెప్పారు. డాలర్ ద్వారా లావాదేవీలను మళ్లించకుండానే వాణిజ్యం నిర్వహించే సాంకేతిక సామర్థ్యం బ్రిక్స్ దేశాలకు ఇప్పటికే ఉందని సాక్స్ పేర్కొన్నారు. స్థానిక కరెన్సీలలో వాణిజ్యాన్ని పరిష్కరించే దిశగా ఈ కూటమి ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. భారతదేశం, చైనా అంతర్జాతీయంగా తమను తాము స్థిరమైన మార్కెట్లుగా ప్రదర్శించుకోవాలని ఆయన సూచించారు.

“ప్రస్తుతం అమెరికా, భారత్, చైనా, రష్యా అనే నాలుగు సూపర్ పవర్స్ ఉన్నాయి. ఈ దేశాల మధ్య సహకారం మరింత పెరగాలి” అని తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా మళ్లీ ఆసియా అవతరిస్తున్న నేపథ్యంలో చైనా, ఆసియాన్, ఆఫ్రికా, గల్ఫ్ దేశాలతో భారత్‌కు ఉన్న సంబంధాలు మరింత కీలకంగా మారతాయని చెప్పారు.