ఆర్బీఐ చేపట్టిన ప్రత్యేక పథకం కారణంగా దేశంలోకి డాలర్ల ప్రవాహం రికార్డు స్థాయిలో పెరగడంతో విదేశీ మారక నిల్వలు ఆల్-టైమ్ గరిష్ఠానికి చేరాయి. దీంతో ఫారెక్స్ నిల్వలు కలిగిన దేశాల జాబితాలో రష్యాను అధిగమించి భారత్ ప్రపంచంలోనే నాలుగో స్థానానికి ఎగబాకింది. ‘బ్లూమ్‌బర్గ్’ డేటా ప్రకారం సెప్టెంబర్ 4తో ముగిసిన వారంలో భారత ఫారెక్స్ నిల్వలు ఏకంగా 44.9 బిలియన్ డాలర్లు పెరిగి 785.7 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరాయి.
ఈ భారీ పెరుగుదలతో ఇప్పటివరకు నాలుగో స్థానంలో ఉన్న రష్యాను భారత్ వెనక్కి నెట్టింది. ప్రస్తుతం ఈ జాబితాలో చైనా, జపాన్, స్విట్జర్లాండ్ మాత్రమే భారత్ కంటే ముందు ఉన్నాయి. ఆర్బీఐ ఈ ఏడాది జూన్ 8న ప్రవేశపెట్టిన ఫారెన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ (బ్యాంక్)నిర్దేశిత లక్ష్యం గడువు కంటే ముందే నెరవేరడంతో, ఆర్బీఐ ఈ పథకాన్ని సెప్టెంబర్ 30కి బదులుగా ఆగస్టు 31నే ముగించింది.
అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడంతో దేశ పసిడి నిల్వల విలువ 2.59 బిలియన్ డాలర్లు తగ్గినా, డాలర్ల ప్రవాహం అధికంగా ఉండటంతో మొత్తం నిల్వలు భారీగా పెరిగాయి. కాగా,డాలర్లలో సూచించే ఈ గణాంకాలలో, నిల్వలలో ఉన్న యూరో, పౌండ్, యెన్ వంటి అమెరికేతర కరెన్సీల విలువలో వచ్చే హెచ్చుతగ్గుల ప్రభావం కూడా కనిపిస్తుంది.
దీనికి భిన్నంగా, ఆ వారంలో బంగారం ధరలు 0.56 శాతం తగ్గి ఔన్స్‌కు 4,429 డాలర్లకు చేరాయి. దీనివల్ల బంగారం నిల్వలు 2.59 బిలియన్ డాలర్లు తగ్గి 113.81 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. సెప్టెంబర్ రెండవ వారం వరకు విదేశీ కరెన్సీ రాక కొనసాగుతుందని అంచనా వేస్తుండటంతో, విదేశీ కరెన్సీ ఆస్తులు మరింత పెరిగి, బహుశా 655 బిలియన్ డాలర్ల స్థాయిని దాటవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
అయితే, రూపాయిపై ఒత్తిడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ముడి చమురు ధరలు, అమెరికా ట్రెజరీ బాండ్ రాబడుల పెరుగుదల కారణంగా, శుక్రవారం నాడు రూపాయి వరుసగా నాలుగవ సెషన్లోనూ పతనమై, డాలర్‌తో పోలిస్తే 94.45 స్థాయి నుండి 95.56 స్థాయికి చేరింది. ఆర్బీఐ జోక్యం తర్వాత రూపాయి నష్టాలు తగ్గాయని డీలర్లు తెలిపారు. పశ్చిమ ఆసియాలో ఘర్షణలు మొదలైనప్పటి నుండి రూపాయి విలువ 4.79 శాతం తగ్గింది. అలాగే ఈ నెలలో 0.4 శాతం క్షీణించింది.
ఆర్బీఐ చేపట్టిన ప్రత్యేక స్వ్యాప్ కార్యకలాపాల ద్వారా ఆగస్టు 31 నాటికి మొత్తం 136.4 బిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీ నిధులు సమకూరాయి. డిసెంబర్ 31 వరకు విదేశీ వాణిజ్య రుణాలు, విదేశీ కరెన్సీ బాండ్లు ఈ సదుపాయం కింద అర్హత కలిగి ఉన్నప్పటికీ, ఎఫ్‌సిఎన్‌ఆర్(బి) డిపాజిట్ల కోసం ఉన్న గడువు మాత్రం ఆగస్టు 31తో ముగిసింది. అయితే, సెప్టెంబర్ 11 వరకు బ్యాంకులు ఇప్పటికే ఖరారైన డిపాజిట్ల కోసం ఈ స్వ్యాప్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.

More Stories
ఘర్షణ పూరితంగా కాకుండా సహకార పూరితంగా బ్రిక్స్ ప్రకటన
భేదాభిప్రాయాలు వివాదాలుగా మారకూడదని భారత్, చైనా ప్రకటన
ప్రైవేట్‌గా ఉండాలన్న టాటా సన్స్ అభ్యర్థనను తిరస్కరించిన ఆర్బిఐ