“భేదాభిప్రాయాలు వివాదాలుగా మారకూడదు” అని పేర్కొంటూ, “సరిహద్దు సమస్యకు న్యాయమైన, సహేతుకమైన, పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారం” కోసం తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు క్సీ జిన్‌పింగ్ ప్రకటించారు ఆరేళ్ల క్రితం చైనా చొరబాట్ల తర్వాత తీవ్రంగా దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించే ప్రయత్నాల మధ్య ఏడేళ్లలో భారతదేశంలో వారిద్దరూ తొలిసారి సమావేశమయ్యారు. “రెండు దేశాలు తమ సంబంధాలపై వ్యూహాత్మక , దీర్ఘకాలిక దృక్పథాన్ని కలిగి ఉండాలి” అని స్పష్టం చేశారు.
భారత్, చైనాలు ఒకరి బలాల నుండి మరొకరు నేర్చుకోవాలని, అలాగే అత్యున్నత స్థాయి బ్రిక్స్ సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి కలిసి పనిచేయాలని జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. సరిహద్దు వివాదాల కారణంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచుకునే లక్ష్యంతో, 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఇద్దరు నేతలు ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు.
‘‘గత శతాబ్దంలో ఎన్నడూ చూడని తీవ్రమైన మార్పులు, అపూర్వమైన మహమ్మారి సమయాల్లో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలుగా ‘గ్లోబల్ సౌత్’లోని కీలక సభ్యులుగా చైనా-భారత్‌లపై గురుతర బాధ్యత ఉంది. ఇరుదేశాలు మానవాళి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, మన ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటూ, అగ్రదేశాలుగా తమ పాత్రను సమర్థవంతంగా పోషించాలి. మనం సమానత్వంతో కూడిన, క్రమబద్ధమైన బహుళ ధ్రువ ప్రపంచాన్ని ఆకాంక్షించాలి. స్వప్రయోజనాల కోసం కాకుండా ప్రపంచ శాంతి, స్థిరత్వం, అభివృద్ధి, సమృద్ధి కోసం మరింత సానుకూల శక్తిని అందించాలి’’ అని జిన్‌పింగ్ పిలుపునిచ్చారు.
భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, ఈ సమావేశంలో ప్రధానమంత్రి, “పరస్పర గౌరవం, పరస్పర సున్నితత్వం, పరస్పర ప్రయోజనం అనే మూడు పరస్పర సూత్రాల ద్వారా ఇరుపక్షాలు మార్గనిర్దేశం చేయబడాలి” అని నొక్కి చెప్పారు. “ద్వైపాక్షిక సంబంధాల నిరంతర అభివృద్ధికి సరిహద్దు ప్రాంతాలలో శాంతి, ప్రశాంతత ఒక ముఖ్యమైన ప్రాతిపదికగా మిగిలి ఉన్నాయి” అని మోదీ పేర్కొన్నారు.

More Stories
ఘర్షణ పూరితంగా కాకుండా సహకార పూరితంగా బ్రిక్స్ ప్రకటన
బెంగాల్ విద్యార్థులకు మొబైల్ ఫోన్లకు ఆర్థిక సాయం రద్దు
బెదిరింపు లేఖలపై దర్యాప్తు, రక్షణ కోరిన కాశ్మీరీ పండిట్లు