ప్రైవేట్‌గా ఉండాలన్న టాటా సన్స్ అభ్యర్థనను తిరస్కరించిన ఆర్‌బిఐ

ప్రైవేట్‌గా ఉండాలన్న టాటా సన్స్ అభ్యర్థనను తిరస్కరించిన ఆర్‌బిఐ
టాటా గ్రూప్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ గ్రూప్ ప్రధాన హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్ లిమిటెడ్, నమోదుకాని పెట్టుబడి కంపెనీగా కొనసాగేందుకు చేసుకున్న దరఖాస్తును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరస్కరించింది. దానికి బదులుగా, “అన్ని మార్గదర్శకాలు/సూచనలను పూర్తిగా పాటించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని” టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీని ఆదేశించింది. 
 
దీని అర్థం, టాటా సన్స్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపిఓ) ద్వారా పబ్లిక్‌గా మారాలి. దాని షేర్లను స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ చేయాలి. టాటా సన్స్ ఇంతకుముందు తన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను స్వచ్ఛందంగా వదులుకోవడానికి,  రిజిస్టర్ కాని కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ (సిఐసి)గా వర్గీకరించటానికి అనుమతి కోరుతూ కేంద్ర బ్యాంకును సంప్రదించింది. టాటా ట్రస్ట్స్ ఛైర్మన్, టాటా సన్స్ డైరెక్టర్ అయిన నోయల్ టాటా కూడా, కంపెనీ ఒక ప్రైవేట్, లిస్ట్ కాని సంస్థగా కొనసాగాలని వాదించారు. 
 
టాటా సన్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌కు రాసిన లేఖలో ఆర్‌బిఐ ఇలా పేర్కొంది, “దయచేసి పైన పేర్కొన్న విషయంపై మీరు మార్చి 28, 2024న రాసిన దరఖాస్తు లేఖను చూడండి. అందులో టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టిఎస్పిఎల్) రిజిస్టర్ కాని కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ (సిఐసి)గా వర్గీకరించటానికి నిర్దేశించిన ప్రమాణాలను నెరవేరుస్తుందని పేర్కొన్నారు. అలాగే ఈ విషయంపై మీరు తదనంతరం పంపిన అనేక ఉత్తర ప్రత్యుత్తరాలను కూడా చూడండి.” 
 
“పై విషయాలను, సంబంధిత అంశాలన్నింటినీ పరిశీలించిన మీదట, నమోదుకాని సీఐసీగా వర్గీకరించబడినందున సీఓఆర్‌ను స్వచ్ఛందంగా అప్పగించాలన్న మీ అభ్యర్థనను ఆమోదించలేమని మేము సలహా ఇస్తున్నాము,” అని ఆర్‌బీఐ తెలిపింది. కాగా, 2022 సెప్టెంబర్‌లో టాటా సన్స్‌ను ఉన్నత శ్రేణి ఎన్‌బీఎఫ్‌సీగా ఆర్బీఐ వర్గీకరించింది. ఫలితంగా మూడేండ్లలో (2025 సెప్టెంబర్‌కల్లా) స్టాక్‌ మార్కెట్లలో నమోదు కావాల్సి ఉన్నది. అయితే దీనికి విముఖంగా ఉన్న టాటా సన్స్‌ 2024లో రూ.21,000 కోట్లకుపైగా ఉన్న రుణాలను తిరిగి చెల్లించేసింది. 

ఈ క్రమంలోనే అదే ఏడాది మార్చిలో తమ కోర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకోదలిచామని, కాబట్టి ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్స్‌ను తిరిగి అప్పగిస్తామంటూ ఆర్బీఐకి ఓ దరఖాస్తు ద్వారా విజ్ఞప్తి చేసింది. ఈ అభ్యర్థనను పెండింగ్‌లో పెట్టిన ఆర్బీఐ టాటా సన్స్‌ను దేశంలోని ప్రధాన ఎన్‌బీఎఫ్‌సీలలో ఒకటిగానే కొనసాగించింది. ఇప్పుడు సదరు విజ్ఞప్తిని తోసిపుచ్చింది. 

ఇక టాటా సన్స్‌ ఆస్తులు రూ.2 లక్షల కోట్లకుపైగానే ఉన్నాయి. ఆర్బీఐ సవరించిన ఇటీవలి నిబంధనల ప్రకారం లక్ష కోట్లు దాటితే ప్రధాన ఎన్‌బీఎఫ్‌సీగానే ఆ సంస్థ ఉంటుంది. దీంతో ఇలాంటి ఓ ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్స్‌ రద్దు కష్టతరమేనన్న వాదనలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.