దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ బొల్లారం మద్రాస్ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాల చోరీ కేసును పోలీసులు ఛేదించారని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. రెజిమెంట్‌లో పనిచేసిన రిటైర్డ్ హవల్దార్ ఉప్పుతోళ్ళ మల్లేశ్ అలియాస్ రాజు చోరీకి పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. చోరీ చేసిన ఆయుధాలను నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని తన స్వగ్రామానికి తీసుకెళ్లి గుంత తీసి పాతిపెట్టినట్లు తెలిపారు.
ఆ తర్వాత వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ఆగస్ట్ 31వ తేదీన బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్‌కు చెందిన బెల్ ఆఫ్ ఆర్మ్స్‌లో ఆయుధాలు, మ్యాగజైన్లు, బుల్లెట్లు, బైనాక్యులర్ దొంగతనం చేసినట్లు డీజీపీ తెలిపారు. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, ఎస్వోటీ, లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఇంటెలిజెన్స్ విభాగాలతో కలిసి ఈ ఆయుధాల చోరీ కేసులో దర్యాప్తు చేపట్టినట్లు డీజీపీ వెల్లడించారు.
సాంకేతిక ఆధారాలతో పాటు డాగ్ స్క్వాడ్, వేలిముద్రలను కూడా పరిశీలించినట్లు తెలిపారు. మొత్తం 16 మంది రెగ్యులర్‌గా ఆయుధాలను ఉపయోగించే వారిగా గుర్తించి వారి కదలికలను పరిశీలించినట్లు తెలిపారు. అదే సమయంలో సెలవులో ఉన్న 54 మంది, పెన్షన్‌కు వెళ్లిన పలువురిని కూడా విచారించినట్లు సీవీ ఆనంద్ వెల్లడించారు.
చోరీ వెనుక బయట వ్యక్తుల ప్రమేయం ఉందా, డ్రగ్స్ మాఫియా లేదా ఇతర నేర కోణాలు ఉన్నాయా అనే అంశాలపైనా దర్యాప్తు చేసినట్లు డీజీపీ తెలిపారు. దర్యాప్తులో భాగంగా బెల్ ఆఫ్ ఆర్మ్స్ ఇన్చార్జ్ వినోద్ కుమార్, ఆమ్యునేషన్స్ విభాగం ఇన్చార్జ్ బల్లి మధులను అనుమానితులుగా విచారించినట్లు సీవీ ఆనంద్ తెలిపారు. అయితే వారి నుంచి చోరీకి సంబంధించి ఎలాంటి కీలక ఆధారాలు లభించలేదని చెప్పారు.
ఆ తర్వాత హవల్దార్లు టీపీఎస్ రావు, మల్లేశ్ అలియాస్ రాజుపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు సీవీ ఆనంద్ తెలిపారు. మల్లేశ్ కదలికలకు సంబంధించిన సాంకేతిక ఆధారాలు తమ వద్ద ఉన్నప్పటికీ తొలుత అతడు నిజాలను దాచిపెట్టే ప్రయత్నం చేశాడని డీజీపీ వెల్లడించారు. విచారణకు రావాలని పోలీసులు పిలిచినా మొదట రాలేదని చెప్పారు. అతడి ఫోన్ కాల్ లిస్ట్, వాట్సాప్ చాటింగ్‌లు డిలీట్ అయినట్లు గుర్తించామని తెలిపారు.
విచారణ సమయంలో మల్లేశ్‌లో భయం, ఆందోళన కనిపించడంతో పోలీసులు మరింత లోతుగా ప్రశ్నించినట్లు చెప్పారు. ఈ క్రమంలో కేసు తీవ్రతను మల్లేశ్ భార్యకు వివరించడంతో ఆమె తన భర్తను గట్టిగా ప్రశ్నించగా, చివరకు మల్లేశ్ ఆయుధాల చోరీ విషయాన్ని అంగీకరించినట్లు వెల్లడించారు. చోరీ చేసిన ఆయుధాలను మల్లేశ్ తన స్వగ్రామానికి తీసుకెళ్లి గుంత తీసి పాతిపెట్టినట్లు సీవీ ఆనంద్ తెలిపారు.
పోలీసులు అతడు చూపించిన ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి ఆయుధాలు, మ్యాగజైన్లు, బుల్లెట్లు, బైనాక్యులర్ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అయితే ఆయుధాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎందుకు తరలించాడు? చోరీ చేసిన తర్వాత వాటిని ఎవరికి ఇవ్వాలనుకున్నాడు? అనే అంశాలపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని డీజీపీ తెలిపారు.
ఈ ఏడాది జూన్ 30న అతడిని ఆర్మీ విధుల నుంచి తొలగించినట్లు అధికారులు గుర్తించారు. క్రమశిక్షణా రాహిత్యం, ఆరోగ్య సంబంధిత కారణాలతో అతడిపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఆర్మీ నుంచి తనను తొలగించారన్న అసంతృప్తి, కోపంతోనే ఈ చర్యకు పాల్పడి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
మరోవంక, మల్లేష్ సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతానికి చెందిన ఓ ఆయుధాల విక్రేత ఇన్స్టాగ్రామ్ ఖాతాను అతడు ఫాలో అవుతున్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. దీంతో చోరీ చేసిన ఆయుధాలను అమ్మేందుకే ఈ పని చేశాడా? ఇంకా ఎవరికైనా అప్పగించాలనుకున్నాడా? అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.

More Stories
కేరళ నుండి ప్రపంచ వ్యాప్తమైన `లవ్ జిహాద్’
ట్రాక్టర్లపై అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు
బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్య అవరోధాలు తొలగించాలి.. మోదీ పిలుపు