లడఖ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తూ ఆర్టికల్ 371 సవరణ!

లడఖ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తూ ఆర్టికల్ 371 సవరణ!
గత నాలుగేళ్లుగా లడఖ్ ప్రజలు చేస్తున్న డిమాండ్ మేరకు లడఖ్‌ ప్రాంతానికి ఆర్టికల్ 371 కింద రాజ్యాంగ పరిరక్షణలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అలాగే హిమాలయ ప్రాంతమైన లడఖ్ పాలన కోసం భారతదేశంలోనే మొదటిసారిగా ‘సూయీ జెనెరిస్’ నమూనాలో ఒక ఎన్నికైన పాలక మండలిని ఏర్పాటు చేయనున్నారు. 
 
ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో లడఖ్ చీఫ్ సెక్రటరీ ఆశిష్ కుంద్రా మాట్లాడుతూ  లడఖ్‌కు తగిన రాజ్యాంగ పరిరక్షణలు కల్పించేందుకు పార్లమెంట్ ఆర్టికల్ 371ని సవరిస్తుందని తెలిపారు. లడఖ్‌కు రాజ్యాంగ పరిరక్షణలు కల్పించడం, ఎన్నికైన మండలిని ఏర్పాటు చేసే ప్రక్రియను కేంద్ర హోం శాఖ ఇప్పటికే ప్రారంభించిందని ఆయన చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 నిర్దిష్ట రాష్ట్రాల ప్రత్యేక ప్రాంతీయ, సామాజిక అవసరాలను తీర్చడానికి తాత్కాలిక, పరివర్తన, ప్రత్యేక అధికారాలను అందిస్తుంది.

‘‘మేము ఒక ప్రత్యేకమైన పాలనా నమూనాపై పనిచేస్తున్నాం. ఇది ‘సూయీ జెనెరిస్’ మోడల్. లడఖ్‌లో ఎన్నికైన పాలక మండలి ఉంటుంది, కానీ ఇది శాసనసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతంగానీ లేదా రాష్ట్రంగానీ కాదు’’ అని కుంద్రా వివరించారు. ‘సూయీ జెనెరిస్’ అనేది ఒక ప్రత్యేక పరిస్థితిని నిర్వహించడానికి రూపొందించిన ఒక ప్రత్యేకమైన చట్టపరమైన వ్యవస్థ. ఈ లాటిన్ పదానికి ‘తనదైన శైలి’ లేదా ‘ప్రత్యేకమైనది’ అని అర్థం. 

 
లడఖ్ నాయకులతో చర్చలు జరుపుతున్న కేంద్ర ప్రభుత్వ బృందంలో ఆశిష్ కుంద్రా భాగస్వామిగా ఉన్నారు. మంగళవారం ఢిల్లీలో ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగాయి. ఆర్టికల్ 370 రద్దుచేసిన కేంద్రం జమ్మూ కశ్మీర్‌, లడఖ్‌‌గా విభజించి ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రారంభంలో లడఖ్‌లోని ఒక వర్గం కేంద్ర నిర్ణయాన్ని స్వాగతించినప్పటికీ, కాలక్రమేణా అధికారుల పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. 
 
వారు రాష్ట్ర హోదాతో పాటు రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ కింద ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఆరో షెడ్యూల్ ప్రకారం భూమి, అడవులు, నీరు, వ్యవసాయంపై చట్టాలు చేసే అధికారంతో స్థానిక కౌన్సిళ్లను ఏర్పాటు చేయవచ్చు. ఇది ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధిలో స్థానిక సమాజాలకు ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని అందిస్తుంది. 
 
గతేడాది లేహ్‌లో భద్రతా బలగాలు, పౌరుల మధ్య జరిగిన ఘర్షణల్లో నలుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ హింస తర్వాత సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ సహా పదుల సంఖ్యలో ప్రజలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో మెజారిటీ ప్రజలపై కేసులను ఇప్పటికే ఉపసంహరించుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. చార్జ్‌షీట్ దాఖలైన కేసులపై లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని కుంద్రా తెలిపారు.