ప్రధాని నరేంద్ర మోదీ తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారన్న రాహుల్ గాంధీ సంచలన ఆరోపణల నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సామ్ పిట్రోడా బహిరంగంగా దూరం పెట్టడంతో ప్రతిపక్ష శిబిరంలో రాజకీయ దుమారం రేగింది. ప్రధాని తన సంభాషణలను పర్యవేక్షిస్తున్నారని, తన పరికరంలో విదేశీ నియంత్రణకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని ఆయనకు తెలుసని పేర్కొంటూ రాహుల్ గాంధీ ‘ఎక్స్’ లో వీడియో ప్రకటన చేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.
ప్రధానితో పండుగ శుభాకాంక్షలు అత్యంత ఆత్మీయంగా పంచుకోవడంతో ఈ రోజుల్లో వార్తల్లో ఉన్న పిట్రోడా, ఎన్డిటివికి ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రధాని మోదీని సమర్థించినట్లు కనిపించారు. రాహుల్ గాంధీ ఆరోపణల నుంచి తనను తాను దూరం చేసుకుంటూ, ప్రధాని అలా చేస్తారని తాను నమ్మడం లేదని పిట్రోడా పేర్కొన్నారు. “ప్రధాని అలా చేయరు. ప్రధాని స్క్రూడ్రైవర్ తీసుకుని కంప్యూటర్ను ముట్టుకోరు,” అని పిట్రోడా స్పష్టం చేశారు.
అయితే, తన ఫోన్‌ను కూడా ట్యాప్ చేస్తున్నారని నమ్మడానికి తన వద్ద బలమైన కారణాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. “నా ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారు, నా ల్యాప్‌టాప్‌పై దాడి జరుగుతోంది. నా బ్యాంకు ఖాతాలపై నిఘా ఉంది. నేను నిపుణులను సంప్రదించాను, వారు నా పరికరాలను పరిశీలించిన తర్వాత ట్యాపింగ్ గురించి నన్ను హెచ్చరించారు,” అని పిట్రోడా తెలిపారు.
తన ఫోన్‌ను ఎవరు ట్యాప్ చేశారని తాను నమ్ముతున్నారో చెప్పడానికి ఆయన నిరాకరించారు. “ఎవరో ఆ పని చేస్తున్నారు. నాకు తెలియదు. నేను పట్టించుకోను. నేను దానితో జీవిస్తున్నాను. నాకు ఎలాంటి సమస్య లేదు,” అని పిట్రోడా చెప్పారు. “మన చుట్టూ చెడ్డవాళ్లు ఉన్నారు. ఏం చేస్తాం?” అని ప్రశ్నించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని ఆరోపిస్తూ, తనపై బహిరంగ చర్చకు అంగీకరించాలని ప్రధానమంత్రికి మరోసారి పిలుపునిచ్చిన రాహుల్ గాంధీ, శుక్రవారం తనపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టిందని తీవ్ర ఆరోపణలు చేసిన తర్వాత ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. “ప్రధానమంత్రికి ఈ విషయం తెలుసు, ఎందుకంటే ఆయన నా ఫోన్‌ను ట్యాప్ చేస్తారు. ఆయన ముఖాముఖి చర్చకు అంగీకరించిన రోజు, విదేశీ శక్తుల నియంత్రణలో ఎవరున్నారు? ఎవరు దేశద్రోహులు? వారు ఎంతకాలంగా దేశ వ్యతిరేక కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారు? అనే విషయాలన్నీ అందరికీ తెలుస్తాయి,” అని కాంగ్రెస్ ఎక్స్ ప్లాట్ఫామ్లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
పైగా, ప్రధాని మోదీ ‘విదేశీ శక్తుల’ నియంత్రణలో ఉన్నారనడానికి రుజువులు ఇప్పటికే తన ఫోన్లో ఉన్నాయని, అందువల్ల ఆ రుజువు ఏమిటో ప్రధానికి ముందే తెలుసని గాంధీ ఆరోపించారు. రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణకు పలువురు ప్రతిపక్ష నాయకులు మద్దతు తెలపగా, ‘ప్రాసంగికంగా ఉండటానికి’ ఇది ఒక ‘షూట్ అండ్ స్కూట్’ (వేగంగా స్పందించి పారిపోయే) విధానమని బీజేపీ కొట్టిపారేసింది.
రాహుల్ గాంధీకి మానసిక ఆరోగ్య పరీక్ష అవసరమని బీజేపీ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ హితవు చెప్పారు. “రాహుల్ గాంధీకి నేను పూర్తి గౌరవంతో చెప్పగలిగేది ఒక్కటే, ఆయన తన బుర్రను పరీక్షించుకోవాలి. ఆయన ఫోన్‌ను ట్యాప్ చేసే శ్రమ ఎవరికీ లేదు. ఆయన ఫోన్‌ను ట్యాప్ చేయడంలో ఎవరికీ ఆసక్తి లేదు. ఒకవేళ ఎవరికైనా ఆసక్తి ఉంటే, అది కూడా ఆయన మెదడు రోజురోజుకీ అబద్ధాలతోనే ఎందుకు పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికే,” అని ఆయన ఎద్దేవా చేశారు.

More Stories
రాజమహేంద్రవరం మేయర్ అభ్యర్థిపై బీజేపీకి టీడీపీ ఒత్తిడి!
అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాక్ పై అద్భుత విజయం
హసీనా అప్పగింతకు బంగ్లాదేశ్ కు భారత్ రెండు షరతులు!