హసీనా అప్పగింతకు బంగ్లాదేశ్ కు భారత్ రెండు షరతులు!

* సైనిక విమానం పంపాలి, మరణ శిక్షపై అప్పీల్ అవకాశం..  న్యాయ పక్రియ పూర్తి అంటున్న బంగ్లా  

బంగ్లాదేశ్‌కు మాజీ ప్రధాని, అవామీ లీగ్ పార్టీ అధ్యక్షురాలు షేక్ హసీనా అప్పగింత విషయంలో భారత్ రెండు షరతులు విధించినట్టు బీబీసీ బంగ్లా సంచలన నివేదిక వెల్లడించింది. ఆమెను తీసుకెళ్లేందుకు సైనిక విమానం పంపాలని, జులై 2024 నాటి విద్యార్థి ఉద్యమం అణచివేత ఆరోపణలకు సంబంధించి హసీనాకు విధించిన మరణ శిక్షపై అప్పీలుకు అవకాశం కల్పించి, విచారణ జరుపుతామని హామీ ఇవ్వాలని భారత్ స్పష్టం చేసినట్టు ఆ కథనం పేర్కొంది. 

 
ఈ మేరకు భారత ప్రభుత్వ, సైనిక అధికారులను ఉటంకిస్తూ బీబీసీ బంగ్లా నివేదించింది. అయితే, హసీనాను ఒక ఖైదీగా అప్పగించడానికి న్యూఢిల్లీ ఇష్టపడటం లేదని భారత పరిశీలకులు భావిస్తున్నారు. హసీనా భారత్‌కు నమ్మకమైన, చిరకాల మిత్రురాలని, ఆమెను ఆ విధంగా అప్పగిస్తే పొరుగు దేశాల్లోని ఇతర రాజకీయ మిత్రులకు తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుందని ఆ నివేదిక పేర్కొంది.  
 
ఈ రెండు షరతుల ఆధారంగా హసీనా తిరిగి వెళ్లేందుకు అనుకూల పరిస్థితులను కల్పించడానికి భారత్ గత కొన్ని నెలలుగా ఢాకాతో తెరవెనుక చర్చలు జరుపుతోందని బీబీసీ బంగ్లా నివేదించింది.  ఈ విషయంలో బంగ్లాదేశ్‌ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీలు వచ్చిన తర్వాతే తదుపరి అడుగులు పడే అవకాశముందని తెలిపింది.

బీబీసీ బంగ్లా నివేదిక ప్రకారం  2024 ఆగస్టు 5న దేశం విడిచి పారిపోయినప్పుడు ఆమె బంగ్లాదేశ్ సైనిక విమానంలోనే భారత్‌కు చేరుకున్నారు. ఇప్పుడు కూడా బంగ్లాదేశ్ సైన్యమే బాధ్యత తీసుకొని, ప్రాధాన్యంగా ఒక సైనిక విమానంలోనే ఆమెను తిరిగి తీసుకెళ్లాలన్నది మొదటి షరతు. 2024 జులై హత్యలకు సంబంధించిన ఆరోపణలపై ఆమెకు విధించిన మరణశిక్షపై అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించడంతో పాటు, ఆమెపై కొత్తగా విచారణ జరిపేలా బంగ్లాదేశ్ హామీ ఇవ్వాలన్నది రెండో షరతు. 

 
2024 జులైలో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి ఆమెపై ఉన్న ఆరోపణలపై మరోసారి నిష్పక్షపాతంగా విచారణ జరగాలని ఢిల్లీ కోరుతున్నట్లు వెల్లడించింది. అంతర్జాతీయ సమాజం, ప్రపంచ మీడియా పర్యవేక్షణలో విచారణ జరిగితేనే న్యాయ ప్రక్రియపై విశ్వసనీయత ఉంటుందని భారత అధికారవర్గాలు భావిస్తున్నట్లు కథనంలో పేర్కొంది. హసీనాను అప్పగించి ఆమె ఉరిశిక్షకు గురయ్యే పరిస్థితిని భారత్‌ కోరుకోవడం లేదని ఓ అధికారి వ్యాఖ్యానించినట్లు తెలిపింది.

భారత్‌లో హసీనా ఆశ్రయం పొందడం అనేది బంగ్లాదేశ్‌తో ద్వైపాక్షిక సంబంధాల విషయంలోనే కాకుండా అంతర్జాతీయ వేదికలపై కూడా ఇబ్బందికరమైన అంశంగా మారిందని ఆ నివేదిక పేర్కొంది. నిరసనకారులపై జరిగిన అణచివేతకు సంబంధించి బంగ్లాదేశ్ కోర్టు దోషిగా నిర్ధారించిన మాజీ ప్రధానికి ఆశ్రయం కల్పిస్తూనే ఉండటంపై అంతర్జాతీయంగా న్యూఢిల్లీ విమర్శలను ఎదుర్కొంటోందని బీబీసీ బంగ్లా తెలిపింది.

రెండేళ్లకుపైగా ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఈ సున్నితమైన సమస్యను పరిష్కరించే మార్గం కోసం న్యూఢిల్లీ ముమ్మరంగా అన్వేషిస్తోంది. హసీనాను మూడో దేశానికి తరలించడమే ముందున్న అత్యంత తక్షణ పరిష్కారమని, అయితే వివిధ దేశాలతో ఆ అవకాశాన్ని పరిశీలించేందుకు భారత్ ప్రయత్నాలు వేర్వేరు కారణాల వల్ల విఫలమయ్యాయని నివేదిక పేర్కొంది.

దీని ఫలితంగా, ఆమె తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్లి అక్కడి న్యాయ ప్రక్రియను ఎదుర్కోవడమే ప్రస్తుతం ఉన్న ఏకైక మార్గమని భారత విధాన నిర్ణేతలు భావిస్తున్నట్లు ఆ నివేదిక తెలిపింది. నిషేధం ఎదుర్కొంటున్న అవామీ లీగ్ పార్టీ రాజకీయంగా మళ్లీ పుంజుకోవాలంటే హసీనా స్వదేశానికి తిరిగి వెళ్లడం తప్పనిసరి.

 
ఆ కథనం ప్రకారం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విదేశీ పౌరులతో భారత అధికారులు క్రమం తప్పకుండా బ్రీఫింగ్స్ నిర్వహిస్తుంటారు. ఈ సమావేశాల్లో తమ వైఖరి గురించి హసీనాకు వివరించారని, భారత అధికారులతో ఒక అవగాహనకు వచ్చిన తర్వాతే డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లాలనే తన ఉద్దేశాన్ని ఆమె ప్రకటించారని ఆ నివేదిక పేర్కొంది. 
 
వచ్చే డిసెంబరులో తాను స్వదేశానికి తిరిగి వెళ్లాలని భావిస్తున్నట్లు హసీనా ఇటీవల రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె ఇప్పటికీ అదే మాటపై ఉన్నప్పటికీ, నిర్దిష్ట తేదీని మాత్రం ప్రకటించలేదు.

భారత విదేశాంగ శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి బీబీసీ బంగ్లాతో మాట్లాడుతూ, ‘‘ఆమెకు మరణ శిక్ష విధిస్తారని తెలుసు కాబట్టి మేము ఎప్పటికీ అప్పగించలేం.. దీనికి బదులుగా, ఆమెకు కొత్తగా న్యాయమైన విచారణ పొందే అవకాశం లభించేలా చూడాలని మేము కోరుకుంటున్నాం” అని వ్యాఖ్యానించారు.  అంతేకాకుండా, ఈ విచారణ ప్రక్రియ అంతర్జాతీయ సమాజం, అంతర్జాతీయ మీడియా పర్యవేక్షణలో జరగాలని భారత్ కోరుకుంటున్నట్లు ఆ అధికారి తెలిపారు.

 
మరోవంక, భారత్ నుంచి పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనాను తిరిగి రప్పించడానికి అవసరమైన అన్ని చట్టపరమైన ప్రక్రియలను బంగ్లాదేశ్ పూర్తి చేసిందని, తదుపరి చర్య న్యూఢిల్లీ చేతిలో ఉందని న్యాయశాఖ మంత్రి మహ్మద్ అసదుజ్జమాన్ శనివారం తెలిపినట్లు స్థానిక మీడియా నివేదికలు పేర్కొన్నాయి. “చట్టపరమైన ప్రక్రియలో భాగంగా మా వైపు నుంచి అవసరమైనవన్నీ మేము పూర్తి చేశాము. వారు (భారత్) ఏమి చేస్తారనేది వారి ఇష్టం,” అని స్పష్టం చేశారు. 
 
హసీనా చట్టపరమైన మార్గాల ద్వారానే తిరిగి వస్తారని, ద్వైపాక్షిక ఒప్పందం కింద ఆమెను అప్పగించడమే ఒక చట్టపరమైన ప్రక్రియ అవుతుందని మంత్రి తెలిపారు. ఆమెకు విధించిన మరణశిక్షపై అప్పీల్ చేసుకునే అవకాశం ఉందా అని అడగ్గా, సంబంధిత చట్టం ప్రకారం ఆమెకు ఆ అవకాశం ఉండదని తేల్చి చెప్పారు. హసీనాను మూడవ దేశానికి పంపడం గురించి భారత్ బంగ్లాదేశ్‌తో చర్చలు జరిపిందా అని అడగ్గా, ఆ ప్రశ్నకు భారత ప్రభుత్వమే సమాధానం చెప్పగలదని మంత్రి తెలిపారు. 

About The Author