* ఇస్రోను ప్రైవేటీకరించంపై చైర్మన్ వి. నారాయణన్ స్పష్టం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అధునాతన అంతరిక్ష పరిశోధన కోసం భారతదేశపు ప్రధాన సంస్థగా కొనసాగుతుందని, ప్రైవేట్ రంగ భాగస్వామ్యం తమ పాత్రను తగ్గించడం కాదని ఆ సంస్థ స్పష్టం చేసింది. అంతరిక్ష సంస్థ ప్రైవేటీకరణ ప్రక్రియ దిశను, ప్రస్తుత ఉద్యోగులపై దాని ప్రభావాన్ని, సంస్థ భవిష్యత్ పాత్రను ప్రశ్నిస్తూ, ఆ సంస్థలోని కీలక ఉద్యోగుల సంఘాలు దాని ఛైర్పర్సన్ వి. నారాయణన్‌కు లేఖ రాశాయని ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ నివేదించిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది.
అంతరిక్ష రంగాన్ని సరళీకరించడం, భారత అంతరిక్ష విధానం 2023, ప్రగతిశీల ఎఫ్‌డిఐ విధానంతో పాటుగా, మరింత పెద్ద, బలమైన, ప్రపంచవ్యాప్తంగా పోటీపడగల భారత అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని ఇస్రో తన ప్రకటనలో పేర్కొంది. “అంతరిక్ష విలువ గొలుసు అంతటా పరిశ్రమలు, స్టార్టప్‌లు మరియు, విద్యాసంస్థలు పాల్గొనేలా వీలు కల్పిస్తున్నాము. తద్వారా ఇస్రో సామర్థ్యాలను పరిపూరకం చేస్తూ, వాటిని అనేక రెట్లు పెంచుతున్నాము. అందువల్ల ఈ సంస్కరణలను ప్రైవేటీకరణగా కాకుండా, పర్యావరణ వ్యవస్థ విస్తరణ, సామర్థ్యాల పెంపుగా చూడాలి,” అని సంస్థ ప్రకటనలో పేర్కొంది.
ఆ ప్రకటనలో ఇలా పేర్కొన్నారు: “అగ్రశ్రేణి పరిశోధన, అభివృద్ధి, అధునాతన సాంకేతికతలు, మానవ అంతరిక్ష యానం, తదుపరి తరం ప్రయోగ వ్యవస్థలు, సుదూర అంతరిక్ష మరియు గ్రహ యాత్రలు, వ్యూహాత్మక, సామర్థ్యాలు వంటి రంగాలలో ఇస్రో శాస్త్రీయ నైపుణ్యం అత్యంత కీలకమైనది. ఈ రంగాలలో ఇస్రో పాత్ర క్రమంగా బలోపేతం అవుతుంది.”
“అదే సమయంలో, పరిణతి చెందిన, నిత్యం తయారయ్యే వ్యవస్థలను పరిశ్రమల ద్వారా మరింతగా విస్తరించవచ్చు. పరిణతి చెందిన ప్రయోగ వాహనాలు, సాధారణ ఉపగ్రహాలు, ఇతర స్థిరపడిన వ్యవస్థల ఉత్పత్తిని సరైన పోటీ ప్రక్రియల ద్వారా పరిశ్రమలు లేదా ప్రభుత్వ రంగ సంస్థలు చేపట్టవచ్చు. ఇది తదుపరి తరం సాంకేతికతలు, యాత్రలకు ఇస్రో మరిన్ని వనరులను, శాస్త్రీయ మానవశక్తిని కేటాయించడానికి వీలు కల్పిస్తుంది,” అని వివరించారు.
2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించడం, 2040 నాటికి చంద్రుడిపైకి భారత సిబ్బందితో కూడిన యాత్రను చేపట్టడం, తదుపరి తరం, పునర్వినియోగ ప్రయోగ వ్యవస్థలను అభివృద్ధి చేయడం , నిరంతర చంద్ర, గ్రహ అన్వేషణను కొనసాగించడం, భారతదేశాన్ని ఒక ప్రధాన ప్రపంచ అంతరిక్ష శక్తిగా నిలపడం వంటివి భారతదేశ ఆశయాలలో ఉన్నాయని అంతరిక్ష సంస్థ తెలిపింది. “ఇవి సాంకేతికంగా అత్యంత సవాలుతో కూడిన యాత్రలు. వాణిజ్య కార్యకలాపాలతో సులభంగా భర్తీ చేయలేని అధునాతన పరిశోధన, సామర్థ్యాలపై ఇస్రో దృష్టి సారించడం అవసరం.”
భారతదేశ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 8.4 బిలియన్ డాలర్లుగా అంచనా వెళ్తున్నారు. వేగంగా విస్తరిస్తున్న ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో ఇది ఇప్పటికీ సాపేక్షంగా చిన్న వాటానేనని అది ఇంకా పేర్కొంది. 2033 నాటికి ప్రపంచ అంతరిక్ష మార్కెట్లో తన వాటాను 44 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. “కేవలం ప్రభుత్వ వనరులు, ఇస్రో సిబ్బందితో మాత్రమే ఆ స్థాయిని సాధించడం సాధ్యం కాదు. దీనికి ప్రైవేట్ పెట్టుబడులు, పారిశ్రామిక సామర్థ్యం, పారిశ్రామిక స్ఫూర్తి, ప్రపంచ మార్కెట్ లభ్యత అవసరం,” అని ఇస్రో వివరించింది.

More Stories
ఢిల్లీలో భవనం కూలడంపై ఎబివిపి నిరసన.. ఎంసిడి కార్యాలయంపై దాడి
`భిన్నత్వం సహజం..ఐక్యతే సత్యం’ చాటి చెప్పడమే హిందూ రాష్ట్ర లక్ష్యం
ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్ భవనం.. ఆరుగురు మృతి