ఢిల్లీ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్ సమీపంలోని సత్య నికేతన్‌లో రద్దీగా ఉండే ఒక సందులో ఉన్న, బాలుర హాస్టల్ గల 50 ఏళ్ల నాటి ఐదు అంతస్తుల భవనం ఆదివారం మధ్యాహ్నం కూలిపోయింది. ఐదంతస్తుల మేడ ఒక్కసారిగా కూలిపోవడంతో శిథిలాల కింద పలువురు విద్యార్థులు చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 11 మంది విద్యార్థులను శిథిలాల నుంచి సురక్షితంగా బయటకు తీయగా, ఆరుగురు చనిపోయినట్లు తెలుస్తోంది.
ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎయిమ్స్ ట్రామా సెంటర్ వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు భవన యజమాని హరిరామ్‌తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదయినట్లు డీసీపీ అమిత్ గోయల్ తెలిపారు. భవనం కూలిన సమయంలో అందులో సుమారు 40 నుంచి 50 మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
శిథిలాల కింద విద్యార్థులు ఎక్కువ మంది విద్యార్థులు చిక్కుకున్నట్లు భావించడంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ, ఎన్‌డీఆర్ఎఫ్, ఢిల్లీ ఫైర్ సర్వీసెస్, ఢిల్లీ పోలీసులు, ఎంసీడీ, సివిల్ డిఫెన్ తదితర బృందాలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నాయి.
ఈ కూలిపోవడం, జాతీయ రాజధానిలోని జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాలలో పేయింగ్ గెస్ట్ వసతి గృహాలుగా వాడుతున్న భవనాల భద్రతపైనా, అలాగే నిర్మాణ, అగ్నిమాపక భద్రతా నిబంధనల అమలుపైనా ఆందోళనలను రేకెత్తించింది. పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతిగా ఉపయోగిస్తున్న ఈ ఐదు అంతస్తుల భవనం నేలమాళిగలో మరమ్మతు పనులు జరుగుతుండగా, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో కూలిపోయిందని ఒక సీనియర్ అధికారి తెలిపారు.
భవనం కూలిపోవడంతో పలు వాహనాలు కూడా శిథిలాల కింద చిక్కుకున్నాయి. కొన్ని రోజుల వర్షాల కారణంగా నేలమాళిగలో నీరు నిలిచిపోవడంతో భవనం పునాది బలహీనపడి, చివరికి కూలిపోయిందని స్థానికులు తెలిపారు. ఈ భవనం దాదాపు 50 ఏళ్ల నాటిదని ఒక పోలీసు అధికారి తెలిపారు. ప్రాణాల ఆచూకీ కోసం 70 మంది సిబ్బందితో కూడిన రెండు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు, ఒక శునక బృందాన్ని రంగంలోకి దించారు.
శిథిలాల కింద చిక్కుకున్న వారు ఊపిరి పీల్చుకోవడానికి ఆక్సిజన్ సిలిండర్లను జారవిడిచామని ఒక ఎన్‌డిఆర్‌ఎఫ్ అధికారి తెలిపారు. ఘటనా స్థలంలో అగ్నిమాపక వాహనాలను సిద్ధంగా ఉంచారు. ఆ ప్రాంతంలో భోజనశాలలు, పీజీలతో నిండిన ఇరుకైన, రద్దీగా ఉండే సందులు ఉన్నాయి. దట్టంగా కట్టిన భవనాల వల్ల కదలడానికి కూడా చోటు ఉండదు.
ఆ ప్రాంతంలో ఉంటున్న విద్యార్థులలో చాలామంది కేరళం, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లకు చెందినవారని, వారు రోడ్డుకు అవతల ఉన్న కళాశాలల్లో చదువుతున్నారని స్థానికులు చెబుతున్నారు. శిథిలాలలో కూరుకుపోయిన వారి కోసం స్థానికులు తమ చేతులతో, దొరికిన పనిముట్లతో తీవ్రంగా గాలిస్తూ సహాయక బృందాలకు తోడయ్యారు.
సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న సీఎం రేఖా గుప్తా
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు సంఘటనా స్థలాన్ని సందర్శించి, అనంతరం ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు వెళ్లి కాపాడినవారిని కలిసి, వైద్యులు, ఆరోగ్య అధికారులతో మాట్లాడారు. ప్రాణాలను కాపాడటం, ప్రాణాలతో బయటపడిన వారి పరిస్థితిని అంచనా వేయడమే ప్రభుత్వ తక్షణ ప్రాధాన్యత అని ఆమె చెప్పారు. “11 మందిని కాపాడారు. నేను ఆసుపత్రికి వెళ్తున్నాను. దీనికి బాధ్యులైన వారు భవన యజమాని అయినా, అధికారి అయినా ఎవరినీ వదిలిపెట్టబోము,” అని గుప్తా పేర్కొన్నారు.
ప్రమాదానికి గల కారణంపై ప్రాథమిక వివరాలు అందిస్తూ, పాతబడిన ఆ కట్టడంపై పునరుద్ధరణ, నిర్మాణ పనులు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. బేస్‌మెంట్‌లో తవ్వకాలు జరపడంతో ఒక స్తంభం పక్కకు జరగడంతో, భవనం పూర్తిగా కూలిపోయిందని చెప్పారు. లెఫ్టినెంట్ గవర్నర్ తరంజీత్ సంధు, పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్, ఎంపీ బాన్సురి స్వరాజ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో భవనం కూలిపోవడం వల్ల జరిగిన ప్రాణనష్టం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటనను ‘బాధాకరం’ అని పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఆయన, సహాయక చర్యల్లో అధికారులు నిమగ్నమై ఉన్నారని తెలిపారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మృతుల పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తన గోవా పర్యటనను కూడా రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయి పరిస్థితి గురించి తాను ముఖ్యమంత్రి, పోలీస్ కమిషనర్, ఎన్‌డిఎంఏ డైరెక్టర్ జనరల్‌తో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. “క్షతగాత్రులకు అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నారు. వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను,” అని ఆయన ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి. నడ్డా గుప్తాను సంప్రదించి సహాయం అందిస్తామని హామీ ఇచ్చినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎఫ్‌ఐఆర్ (ఎఫ్ఐఆర్) నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. భవన యజమాని కోసం ఏడు నుంచి ఎనిమిది బృందాలు గాలిస్తున్నాయి.

More Stories
మాజీ స్పీకర్ ప్రసంగాల సంకలనం `ప్రజల పక్షాన శ్రీపాద వాణి’
2029 నాటికి మాదకద్రవ్య రహిత దేశంగా భారత్
`అక్రమ నిరసన’లో మైనర్ బాలిక పాల్గొన్నందుకు సిపిజెపై చర్యలు!