భారతదేశాన్ని మాదకద్రవ్య రహిత దేశంగా మార్చడానికి మోదీ ప్రభుత్వం 2029ని లక్ష్యంగా పెట్టుకుంది. నక్సలిజం, ఉగ్రవాదం వంటి మహద్రోగాలను అంతం చేయడానికి ఎలాగైతే కృషి చేసిందో, అలాగే అభివృద్ధి చెందిన భారతదేశమనే కలను సాకారం చేసుకునేందుకు దేశాన్ని మాదకద్రవ్య రహితంగా మార్చడానికి ప్రధానమంత్రి కట్టుబడి ఉన్నారని హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు.
ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్, ‘మై భారత్’ వేదికల ద్వారా ప్రభుత్వం లక్ష మంది ‘నశముక్తి మిత్రులకు’ (మాదకద్రవ్య రహిత భారతదేశ రాయబారులకు) శిక్షణ ఇస్తుంది. విద్యా ప్రాంగణాలను మాదకద్రవ్య రహితంగా మార్చడానికి విద్యా, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖలతో పాటు విద్యా సంస్థలు సమిష్టిగా సంకల్పించాయి. “సామర్థ్య నిర్మాణం, సమన్వయం కోసం 100% కేంద్ర సహాయం అందిస్తాము. మార్చి 27 లోగా దేశంలోని ప్రతి రాష్ట్రంలో పూర్తి సదుపాయాలతో కూడిన మాదకద్రవ్యాల నిరోధక టాస్క్ ఫోర్స్‌లను (ఏఎన్టీఎఫ్) ఏర్పాటు చేస్తామని అమిత్ షా తెలిపారు.
30 రోజుల్లోగా ఫోరెన్సిక్ నివేదికలు అందేలా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తగిన ఏర్పాట్లు చేస్తుంది. “కాలపరిమితిలోగా అమలు చేయడానికి మేము 25కు పైగా అంశాలను, కార్యాచరణ పాయింట్లను కూడా నిర్ధారించాము. ఈ మూడేళ్ల ‘మాదకద్రవ్య రహిత భారత్’ ప్రచారంలో యావత్ దేశ సహకారం లభిస్తుందని నేను విశ్వసిస్తున్నాను,” అని ఆయన చెప్పారు.
ఈ మిషన్‌ను విజయవంతం చేయడానికి, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయి. “మా రోడ్‌మ్యాప్, విజన్ డాక్యుమెంట్ ఈ నాలుగు స్తంభాలపై ఆధారపడి ఉన్నాయి – మొదటిది: నిఘా, ఆపరేషన్ ఆధారిత అమలు; రెండవది: ప్రికర్సర్ రసాయనాలు, సింథటిక్ డ్రగ్స్‌పై నియంత్రణ; మూడవది: డిమాండ్, హాని తగ్గింపు; నాలుగవది: సామర్థ్య నిర్మాణం, సమన్వయం.
100 అంతర్జాతీయ, అంతర్రాష్ట్ర నెట్‌వర్క్‌లను నిర్మూలించి, మాదకద్రవ్యాల కేసులతో సంబంధం ఉన్న 100 మంది పరారీలో ఉన్నవారిని దేశానికి తిరిగి తీసుకురావాలని కూడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జాతీయ విధానం, నిఘా సమాచార సమన్వయం, ప్రధాన ముఠాలపై దర్యాప్తులు, రాష్ట్రాలతో సమాచార మార్పిడి వంటి అంశాలపై నిర్మించిన పటిష్టమైన పునాదిని ఉపయోగించుకొని, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఎన్‌సిబి తమ అమలు ప్రయత్నాలను మరింత పదును పెడతాయి.
“రాష్ట్ర పోలీసులు, మాదకద్రవ్యాల నిరోధక టాస్క్ ఫోర్స్‌లు, జిల్లా పోలీసులు కలిసి ప్రధాన సూత్రధారులపై డాక్యుమెంట్లు తయారు చేయడానికి, వెనుక, ముందు సంబంధాలపై సమన్వయం చేసుకోవడానికి, వాణిజ్య పరిమాణంలో మాదకద్రవ్యాలు ఉన్న ప్రతి కేసులో ఆర్థిక దర్యాప్తు నిర్వహించడానికి సహకరిస్తాయి. దీనిపై నిర్దుష్టమైన చర్యలు తీసుకుంటాము,” అని షా పేర్కొన్నారు.
మాదకద్రవ్యాల మాఫియాలను పట్టుకోవడానికి, వాటి ఆర్థిక జాడను కనుక్కోవడానికి ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలైన సిబిఐ, ఇడి, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్‌లను నియమించింది. “విమానాశ్రయాలు, కార్గో టెర్మినళ్లలో ప్రమాద స్థాయి ఆధారిత ప్రొఫైలింగ్ స్కానర్లను ఏర్పాటు చేయడం ద్వారా నిఘా కార్యకలాపాలను మరింత పటిష్టం చేస్తాం,” అని హోం మంత్రి చెప్పారు.
“ముడి రసాయనాలు, సింథటిక్ మాదకద్రవ్యాల తయారీకి పాల్పడుతున్న రహస్య ప్రయోగశాలలను ధ్వంసం చేయడంలో ఇప్పటివరకు మేము గణనీయమైన విజయం సాధించాము. రాబోయే మూడేళ్లలో అటువంటి 100 ప్రయోగశాలలను నిర్వీర్యం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ సమస్యను అరికట్టేందుకు రెవెన్యూ శాఖ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, జీఎస్టీఎన్, ఎక్సైజ్ శాఖలు సమన్వయంతో పనిచేస్తాయి,” అని ఆయన పేర్కొన్నారు.
“మా ప్రభుత్వం మాదక ద్రవ్యాల నిరోధక ప్రచారం చేస్తుంది. అవగాహన, చికిత్స, కౌన్సిలింగ్, పునరావాసం, జీవనోపాధి అవకాశాలను అనుసంధానిస్తాం. అంతేకాదు డ్రగ్స్కు బానిసలైన వ్యక్తులకు మద్దతు ఇవ్వడానికి 1933 మానస్ హెల్ప్లైన్ను ప్రవేశపెట్టాం. ఈ రాజకీయ సంకల్పం, సమన్వయంతో కూడిన చర్యలతో 2029 నాటికి మాదకద్రవ్య రహిత భారత్ను సాధించడమే లక్ష్యంగా మోదీ సర్కార్ పనిచేస్తుంది” అని అమిత్ షా స్పష్టం చేశారు.

More Stories
`భిన్నత్వం సహజం..ఐక్యతే సత్యం’ చాటి చెప్పడమే హిందూ రాష్ట్ర లక్ష్యం
ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్ భవనం.. ఆరుగురు మృతి
మాజీ స్పీకర్ ప్రసంగాల సంకలనం `ప్రజల పక్షాన శ్రీపాద వాణి’