తెలంగాణాలో `ఎస్ఐఆర్’ విచారణ ప్రక్రియ బీఎల్వోలు ఓటర్లను నేరుగా కలిసి నోటీసులు ఇచ్చి అవగాహన కల్పించకపోవడంతో ముందుకు సాగడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 47.79 లక్షల మందికి నోటీసులు జారీ కాగా, 32 లక్షల మంది నుంచి సమాధానం రాలేదని అధికారులు చెబుతున్నారు. విచారణకు హాజరు కాని వారికి మరోసారి నోటీసులు ఇస్తున్నారు. ఓటరు తుది జాబితాలో పేరు ఉండాలంటే కచ్చితంగా నోటీసులకు సమాధానం ఇవ్వాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చే సమయంలో కనిపించిన గందరగోళమే ఇప్పుడూ కనిపిస్తోంది. నో మ్యాపింగ్, అనామలీస్ కేటగిరీల్లో 92 లక్షల 88 వేల 127 మందికి నోటీసులు జనరేట్ అయ్యాయి. రోజుకు 2 లక్షల 32 వేల నోటీసులు జారీ చేయాలని సీఈవో కార్యాలయం లక్ష్యం నిర్దేశించింది. వాటిని ఓటర్లకు ఇచ్చే బాధ్యతను బీఎల్వోలకు అప్పగించారు. కొన్ని ప్రాంతాల్లో నోటీసులు ఇవ్వకపోయినా ఇచ్చినట్లు రికార్డుల్లో రాస్తున్నట్లు తెలుస్తోంది.
విచారణ సమయానికి వారం రోజుల ముందు ఓటర్లకు వ్యక్తిగతంగా నోటీసు ఇవ్వాలని సీఈవో కార్యాలయం ఆదేశించింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. బీఎల్వోలు ఇళ్లకు వెళ్లకుండానే ఓటరుకు ఫోన్ చేసి హియరింగ్‌కు రావాలని చెబుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏ డాక్యుమెంట్లు సమర్పించాలో అర్థం కాక కొందరు ఓటర్లు విచారణకు వెళ్లడం లేదని తెలుస్తోంది.
మరికొందరు ఈసీ పేర్కొన్న 12 డాక్యుమెంట్లు అందుబాటులో లేక విచారణకు హాజరయ్యే విషయంలో నిరాసక్తత చూపుతున్నట్లు సమాచారం. రాజకీయ పార్టీలు నియమించిన బీఎల్వోలు కూడా ఓటర్లకు సహకరించటం లేదనే విమర్శలున్నాయి. ఇప్పటి వరకు 5.74 లక్షల మంది నోటీసులు అందుకొని డాక్యుమెంట్లు సమర్పించారు.
తెలంగాణలో సుమారు 3 లక్షల మంది ఓటర్ల పేర్లను ఓకే చేసి, తుది జాబితాలో చేర్చేందుకు సిద్ధం చేశారు. 564 దరఖాస్తులను తిరస్కరించారు. ఇంకా ఏఈఆర్వోలు, ఈఆర్వోలు, డీఈవోల స్థాయిలో చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయి. మరోవంక, కలెక్టర్ల స్థాయిలో సుమారు రెండున్నర లక్షల దరఖాస్తుల వెరిఫికేషన్ పెండింగ్‌లో ఉన్నాయి. కొత్త ఓటు నమోదు, అడ్రస్, ఇతర వివరాల మార్పు కోసం సుమారు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, దాదాపు ఏడున్నర లక్షలను ఆమోదించారు. మిగతావి పరిశీలన దశలో ఉన్నాయి.

More Stories
ప్రత్యేక విద్యాబోధకులు పిల్లలకే కాకుండా తల్లితండ్రులకూ బోధించాలి
22ఏ నిషేధిత భూముల జాబితాకు నిరసనగా బిజెపి మహాధర్నా
తెలంగాణలో మహిళలకు రక్షణ కరువు