తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటుతూ సద్దుల బతుకమ్మ సంబరం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. రాజధానిలోని ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు పరిసరాలు రంగురంగుల పూల బతుకమ్మలతో కళకళలాడాయి. ఎటుచూసినా పూల పరిమళాలు.. ఎక్కడ విన్నా బతుకమ్మ పాటలతో ఆడపడుచుల ఆటపాటలతో పండుగ వాతావరణం పులకించింది. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై తొమ్మిదిరోజుల పాటు సాగిన పూల పండుగ ఆదివారం సద్దులతో వైభవంగా ముగిసింది.
తీరొక్క రంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో ఆలయాలు, కూడళ్లు, చెరువు, కాలువల గట్ట వద్దకు చేరుకొని ఆడబిడ్డలు ఆడిపాడారు. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు గౌరమ్మ ఉయ్యాలో’ అంటూ ఊరూరా బతుకమ్మ పాటలతో హోరెత్తించారు. కళాకారుల సాంసృతిక ప్రదర్శనలు, లేజర్ షో, బాణసంచా వెలుగులతో ఆ ప్రాంతమంతా ధగధగా మెరిసిపోయింది.
ఎటుచూసినా పండుగ సందడే కనిపించగా, నగరవాసులు ఉత్సాహంగా సంబురాల్లో పాల్గొన్నారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు, యువతులు, చిన్నారులు సంప్రదాయబద్ధంగా ఆడిపాడారు. బతుకమ్మ పాటలు, కోలాటంతో పరిసరాలన్నీ మార్మోగాయి. నీటి వృథాను అరికట్టి, జల వనరులను సంరక్షించుకోడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా సందేశం ఇచ్చారు. ప్రజలందరికీ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు చెప్పిన ఆయన అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
గవర్నర్ సతీమణి జానకి, మంత్రి సీతకతోపాటు ప్రముఖ సినీనటులు రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ దంపతులు బతుకమ్మ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వివిధ వేదికలపై కళాకారులు ప్రదర్శించిన సాంసృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. లేజర్‌షో, బాణసంచా కాంతులు ఆకాశంలో రంగుల హరివిల్లును ఆవిషరించాయి.
అమరవీరుల స్థూపం నుంచి కళాకారులు, మహిళలతో కలిసి మంత్రి సీతక్క బతుకమ్మలను ఊరేగింపుగా ట్యాంక్‌బండ్ వద్దకు తీసుకువచ్చి అక్కడ వారంతా ఆడి పాడారు. ప్రకృతి, పండగలను కాపాడుకుంటూ అందరం ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని సీతక్క ఆకాంక్షించారు. “బతుకమ్మ అంటే బతుకునిచ్చే పండుగ. మన పూర్వీకులు మనకు ఇలాంటి గొప్ప సంప్రదాయాలు, అనుబంధాలు, అప్యాయతలు, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే గొప్ప పండుగను ఇచ్చారు. ఇలాంటి మంచి సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది” అని మంత్రి సీతక్క తెలిపారు.

More Stories
హైదరాబాద్ మెట్రోకు ఆరు నెలల్లో రూ.405 కోట్లకు పైగా నష్టం
తెలంగాణాలో ఐదేళ్లలో 33 శాతం పెరిగిన విడాకులు
అంబర్‌పేటలో 72 అడుగుల భారీ బతుకమ్మతో సరికొత్త రికార్డు!