ఓ గంట భారీ వర్షానికే ఢిల్లీ అతలాకుతలం 

ఓ గంట భారీ వర్షానికే ఢిల్లీ అతలాకుతలం 
శుక్రవారం మధ్యాహ్నం ఓ గంటసేపు కురిసిన భారీ వర్షానికి దేశ రాజధాని ఢిల్లీ అతలాకుతలమైంది. దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌), పశ్చిమ ఢిల్లీలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. సాగర్‌పూర్‌లోని గాంధీ మార్కెట్‌ సహా అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నీరు చేరింది. చాలా చోట్ల నివాస కాలనీల్లోని రోడ్లు నీట మునిగి, చెరువులను తలపిస్తున్నాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షపాతంపై రెడ్‌ వార్నింగ్‌ జారీచేసింది.
 
ఈ కురిసిన వర్షం కారణంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 3 లోపల, బయట జలమయమైంది. టెర్మినల్‌లోని కొన్ని భాగాల్లో కూడా వర్షపు నీరు కనిపించింది. టెర్మినల్ లోపల నీటితో నిండిన ప్రాంతాల గుండా విమానాశ్రయ సిబ్బంది, ప్రయాణికులు నడుస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది. నిలిచిపోయిన వర్షపు నీటిని తోడివేయడానికి అదనపు సిబ్బందిని నియమించారు. 
 
శుక్రవారం సాయంత్రం కురిసిన ఎడతెరిపి లేని వర్షం నుంచి ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలు ఇంకా కోలుకోకముందే, శనివారం మరో “మంచి వర్షపు రోజు” కోసం జాతీయ రాజధాని ప్రాంతం సిద్ధమవుతోంది. ఈ ప్రాంతమంతటా మరింత వర్షం కురిసే అవకాశం ఉంది. అయితే, ఆదివారం నాటికి వాతావరణం మెరుగుపడే అవకాశం ఉందని, సెప్టెంబర్ 8 వరకు ఈ ప్రాంతంలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. 
 
అయినప్పటికీ, శనివారం రోజంతా ఉరుములతో కూడిన భారీ వర్షాలు కొనసాగుతాయని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండి సూచించింది. పొరుగు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా, ఘజియాబాద్, హర్యానాలోని గురుగ్రామ్, ఫరీదాబాద్‌లలో కూడా భారీ వర్షాలు కొనసాగుతాయని ఐఎమ్‌డి వాతావరణ సూచన తెలిపింది. 
 
ఈ ప్రాంతంలో నెలకొన్న స్పష్టమైన అల్పపీడన ప్రాంతమే విస్తారంగా భారీ వర్షాలకు కారణమవుతోందని అది పేర్కొంది. అంతేకాకుండా, శనివారం తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డి హెచ్చరించింది. 
 
ముఖ్యంగా ఢిల్లీ, గురుగ్రామ్‌లోని కొన్ని ప్రాంతాలలో, కానాట్ ప్లేస్ (సీపీ), లూటియన్స్ ఢిల్లీ, ఐటీఓ, సైబర్ సిటీ కమర్షియల్ హబ్, శంకర్ చౌక్, శీతలా మాతా రోడ్ వంటి అనేక ప్రముఖ ప్రదేశాలలో ట్రాఫిక్ జామ్‌లు నమోదయ్యాయి. ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలకు కూడా అంతరాయం కలగడంతో, చాలా మంది ప్రయాణికులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. 
 
వర్షం కారణంగా రాజధానిలో గాలి నాణ్యత సూచిక కూడా మెరుగుపడింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ప్రకారం, శుక్రవారం నాడు ఏక్యూఐ 71గా నమోదైంది, ఇది ‘సంతృప్తికరమైన’ కేటగిరీలోకి వస్తుంది.