పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌లపై బీజేపీ తన దాడిని తీవ్రతరం చేస్తూ రాష్ట్రంలో ఒక వ్యవస్థీకృత ‘బదిలీలకు నగదు’ ఇచ్చిపుచ్చుకునే పోస్టింగ్ నెట్‌వర్క్ పనిచేస్తోందని ఆరోపిస్తూ, నిష్పక్షపాత విచారణ జరిగేలా చూడటానికి మాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సహా పంజాబ్ ఉన్నతాధికారుల బదిలీలు, పోస్టింగ్‌ల కోసం ఒక ‘రేట్ కార్డ్’ ఉన్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణలో వెలుగులోకి వచ్చిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆరోపించారు. ఈ ఆరోపిత ఏర్పాటులో నిర్దిష్ట బాధ్యతలు, శాఖలకు ధరలను నిర్ణయించడం ఇమిడి ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈడీ విచారణలో వెలుగులోకి వచ్చిన విషయాలలో మాన్ ఓఎస్‌డీ రాజ్‌బీర్ సింగ్ ఘుమన్ పేరు కూడా ఉందని భాటియా ఆరోపించారు. ముఖ్యమంత్రికి తెలియకుండా, ఆయన కళ్ల ముందే ఇలాంటి ఆరోపిత కార్యకలాపం ఎలా కొనసాగిందని ఆయన ప్రశ్నించారు. ఆరోపణల ప్రకారం ఈ వసూళ్ల నెట్‌వర్క్ వెనుక కేజ్రీవాల్ సూత్రధారిగా ఉన్నారా? దర్యాప్తులో పేర్లున్న వారిపై ముఖ్యమంత్రి ఏమైనా చర్యలు తీసుకున్నారా? అనే విషయాలపై మన్‌ను కోరారు.
పంజాబ్, హర్యానా హైకోర్టు ముందు ఈడీ ఉంచిన సమాచారాన్ని ప్రస్తావిస్తూ, పోస్టింగ్‌లు, బదిలీలకు సంబంధించిన ముసాయిదా జాబితాలు మధ్యవర్తుల వాట్సాప్ ఖాతాలు లేదా మొబైల్ ఫోన్‌లలో లభించాయని ఆయన ఆరోపించారు. ఇది తీవ్రమైన పాలన, భద్రతాపరమైన ఆందోళన అని పేర్కొంటూ, రహస్య ప్రభుత్వ సమాచారం శాంతిభద్రతలు, జాతీయ భద్రత వంటి సున్నితమైన అంశాలకు సంబంధించినది కావచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
అలాంటి సమాచారం ప్రైవేట్ మధ్యవర్తులకు ఎలా చేరిందని భాటియా ప్రశ్నించారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పంజాబ్ పోలీసులకు ఈడీ పదేపదే లేఖలు రాసినప్పటికీ, ఏడుసార్లు సంప్రదించినా ఒక్క ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు కాలేదని భాటియా ఆరోపించారు. మాన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నంత కాలం ఈ విషయంపై జరిగే విచారణను స్వతంత్రమైనదిగా పరిగణించలేమని ఆయన స్పష్టం చేశారు.
ఈ మొత్తం విషయాన్ని సీబీఐ వంటి స్వతంత్ర సంస్థ విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కూడా భాటియా ప్రస్తావిస్తూ ఆ పిటిషన్‌లో, పంజాబ్‌లో బదిలీల కోసం నగదు, విధానాల కోసం నగదు, టెండర్లకు సంబంధించిన అవకతవకలతో సహా “సంస్థాగత”, “వ్యవస్థీకృత” అవినీతి జరిగిందని ఆరోపించారని తెలిపారు.
ముఖ్యమంత్రికి తెలియకుండా, ఒక మధ్యవర్తి నెట్‌వర్క్ ద్వారా 20 మందికి పైగా సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఎలా బదిలీ చేయడం లేదా పోస్టింగ్ ఇవ్వడం సాధ్యమైందని కూడా ఆయన ప్రశ్నించారు.

More Stories
రామ మందిరం సీఈఓ కావడం శ్రీ రాముడి ఆశీర్వాదం
మణిపూర్ అసెంబ్లీకి మూడేళ్ళ తర్వాత కుకీ ఎమ్మెల్యేలు
భారత్‌ను హిందూ దేశంగా ప్రకటించాలి