మణిపూర్ అసెంబ్లీకి మూడేళ్ళ తర్వాత కుకీ ఎమ్మెల్యేలు

మణిపూర్ అసెంబ్లీకి మూడేళ్ళ తర్వాత కుకీ ఎమ్మెల్యేలు
మణిపూర్‌లో మైతీ, కుకీ తెగల మధ్య సంఘర్షణ జరిగిన మూడేళ్ల తర్వాత కుకీ ఎమ్మెల్యేలు తొలిసారి స్వయంగా అసెంబ్లీకి హాజరయ్యారు. ముఖ్యమంత్రి యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ వారి నిర్ణయాన్ని స్వాగతించారు. రాష్ట్రంలో ఐక్యత, శాంతిని పెంపొందించే దిశగా ఇది ఒక సానుకూల అడుగు అని పేర్కొన్నారు. మణిపూర్‌ 12వ శాసనసభ 8వ సమావేశాలు బుధవారం ఇంఫాల్‌లో ప్రారంభమయ్యాయి. 
 
తెగల మధ్య సంఘర్షణ నేపథ్యంలో మూడేళ్లకు పైగా విరామం తర్వాత కుకీ సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యులు అసెంబ్లీకి స్వయంగా రావడం ముఖ్య పరిణామంగా నిలిచింది. సైతు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే హాఖోలెట్ కిప్జెన్, సైకుల్ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే కిమ్నియో హావోకిప్ హాంగ్‌షింగ్ స్వయంగా సభకు హాజరయ్యారు. చాలా కాలం తర్వాత తిరిగి అసెంబ్లీకి హాజరుకావడం సంతోషంగా ఉందని హాఖోలెట్ కిప్జెన్ చెప్పారు.

కాగా, కుకీ సామాజిక వర్గానికి చెందిన మణిపూర్‌ ఉప ముఖ్యమంత్రి నెమ్చా కిప్జెన్ వర్చువల్‌గా సమావేశాలకు హాజరయ్యారు. గత మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశానికి ఆరుగురు కుకీ శాసనసభ్యులు వర్చువల్‌గా పాల్గొన్నారు. అయితే ఈసారి సమావేశాలకు ఇద్దరు కుకీ ఎమ్మెల్యేలు స్వయంగా అసెంబ్లీకి హాజరుకావడం విశేషం.

కుకీ ఎమ్మెల్యేలు స్వయంగా అసెంబ్లీకి హాజరుకావడాన్ని ముఖ్యమంత్రి యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ స్వాగతించారు.  వివిధ వర్గాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించడానికి, వారి మధ్య నెలకొన్న అపనమ్మకాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిరంతర కృషి వల్లే ఈ పరిణామం సాధ్యమైందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

హింసాకాండతో అట్టుడికిన  రాష్ట్రంలో అందరినీ కలుపుకొనిపోయే చర్చలు, సయోధ్య మరియు శాశ్వత శాంతి, సాధారణ పరిస్థితుల పునరుద్ధరణ పట్ల తన ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఫిబ్రవరి 4, 2026న ముఖ్యమంత్రి ఖేమ్‌చంద్ సింగ్ నాయకత్వంలో కొత్త బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కొందరు కుకీ-జో ఎమ్మెల్యేలు గత అసెంబ్లీ సమావేశాల్లో వర్చువల్ విధానం ద్వారా పాల్గొన్నారు. 

కాగా, కుకీ-జో ప్రజల ‘ప్రత్యేక పరిపాలన’ డిమాండ్‌పై రాజకీయ పరిష్కారం లభించే వరకు మణిపూర్ శాసనసభ ఎనిమిదవ సమావేశాలకు హాజరయ్యేందుకు ఇంఫాల్‌కు వెళ్లవద్దని, కుకీ గిరిజన సమాజానికి చెందిన అత్యున్నత సంస్థ అయిన ‘కుకీ ఇన్పి మణిపూర్’ (కెఐఎం) ఆగస్టు 31న ఆ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలందరికీ కఠిన ఆదేశాలు జారీ చేసింది. మణిపూర్‌ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్‌ 7 వరకు కొనసాగనున్నాయి.