వచ్చే 10 ఏళ్లలో 100 కొత్త విమానాశ్రయాలు

వచ్చే 10 ఏళ్లలో 100 కొత్త విమానాశ్రయాలు
రానున్న పదేళ్లలో దేశవ్యాప్తంగా 100 కొత్త విమానాశ్రయాలను నిర్మించేందుకు సుమారు రూ.30 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి దేశంలో మూడో ‘హబ్ అండ్ స్పోక్’ కార్యకలాపాలను ప్రారంభిస్తూ  ప్రాంతీయ విమాన కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడానికి కేంద్రం ‘ప్రాంతీయ అనుసంధాన పథకం-సవరించిన ఉడాన్’ను అమలు చేయనుందని తెలిపారు. 
 
2026-27 నుంచి 2035-36 ఆర్థిక సంవత్సరం వరకు పదేళ్ల పాటు ఈ పథకం కొనసాగనుంది. కేంద్ర బడ్జెట్ మద్దతుతో మొత్తం రూ.28,840 కోట్ల వ్యయాన్ని ప్రభుత్వం ప్రతిపాదించిందని చెప్పారు. దేశంలో కొత్త విమానాశ్రయాలను నిర్మించడం మాత్రమే కాకుండా, వాటిని సమర్థవంతంగా అనుసంధానించడం కూడా కీలకమని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ ఈ నేపథ్యంలో ‘హబ్ అండ్ స్పోక్’ విధానంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. 
 
సాధారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు దేశంలోని కొన్ని ప్రధాన నగరాల నుంచే ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు ఢిల్లీ నుంచి 54 అంతర్జాతీయ గమ్యస్థానాలకు నేరుగా విమాన కనెక్టివిటీ ఉందని మంత్రి వివరించారు. అయితే దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా తమ ప్రాంతాల నుంచి అంతర్జాతీయ గమ్యస్థానాలకు సులభంగా చేరుకునే అవకాశం కోరుకుంటున్నారని చెప్పారు. 
 
ఈ అవసరాన్ని తీర్చేందుకు ప్రధాన విమానాశ్రయాలను ‘హబ్‌’లుగా ఉపయోగించుకుని ఇతర నగరాలను వాటితో అనుసంధానించే ‘స్పోక్‌’ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ‘హబ్ అండ్ స్పోక్’ కార్యకలాపాలను తొలుత వారణాసి, అమృత్‌సర్‌లో ప్రారంభించినట్లు రామ్మోహన్ నాయుడు చెప్పారు. తాజాగా అహ్మదాబాద్‌ను మూడో కేంద్రంగా ఎంపిక చేసినట్లు వెల్లడించారు. 
 
గుజరాత్‌కు చెందిన ప్రవాస భారతీయులు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్నారని, ఈ ప్రాంతం నుంచి అంతర్జాతీయ విమాన కనెక్టివిటీ కోసం మంత్రిత్వ శాఖకు అనేక విజ్ఞప్తులు వస్తున్నాయని మంత్రి చెప్పారు. అందుకే అహ్మదాబాద్‌ను ఈ కార్యక్రమానికి అనువైన కేంద్రంగా ఎంచుకున్నట్లు వివరించారు. 
 
అహ్మదాబాద్ నుంచి ప్రారంభమైన ఈ కార్యకలాపాలు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రయాణికుల సౌకర్యానికి ప్రాధాన్యం ఇస్తూ విమానయాన వ్యవస్థను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి తదితరులు పాల్గొన్నారు.