ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు తాజాగా జరిపిన దాడుల్లో ఒక భారతీయుడు సహా 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు ఉక్రెయిన్‌లోని 28 స్థావరాలపై రష్యా దాడి చేసింది. 200 వరకు డ్రోన్లు, మిస్సైళ్లతో దాడి చేసింది. కీవ్‌తోపాటు ఒడెశా ప్రాంతంపై బాలిస్టిక్ మిస్సైల్స్, క్రూయిజ్ మిస్సైల్స్, యాంటీ రాడార్ మిస్సైళ్లతో దాడికి పాల్పడింది.
క్షతగాత్రుల్లో పిల్లలు కూడా ఉన్నారు. జనావాసాలపై ఈ దాడులు జరిగాయి. అనేక ఇండ్లు, అపార్ట్మెంట్లు ధ్వంసమయ్యాయి. దాడి అనంతరం ధ్వంసమైన నివాసాల నుంచి అధికారులు ప్రజల్ని ఖాళీ చేయిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ స్థాయిలో సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఈ దాడుల కారణంగా అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో ఉక్రెయిన్‌కు సాయం అందించేందుకు యురోపియన్ యూనియన్ సిద్ధమైంది. ఆర్థిక సాయంతోపాటు 104 బిలియన్ డాలర్ల అప్పు ఇచ్చేందుకు కూడా ఈయూ ప్రయత్నిస్తోంది. ఒడెస్సా, కీవ్, ఖేర్సన్, దొనెట్స్, జపోరిజియా, సుమీ, దినిప్రోలో వందల డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో రష్యా విరుచుకుపడిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు.
పుతిన్ సేనల దాడుల్లో అనేక భవనాలు, మౌళిక సదుపాయాలు ధ్వంసమయ్యాయని, వేలాది కుటుంబాలకు విద్యుత్ నిలిచిపోయిందని చెప్పారు. రొమేనియాతో సరిహద్దు క్రాసింగ్‌తో పాటు అక్కడి ఎగుమతుల సదుపాయాలు కూడా దెబ్బతిన్నట్లు జెలెన్స్కీ వెల్లడించారు. రష్యా దాడుల్లో చనిపోయిన భారతీయుడితో సహా మృతుల కుటుంబాలకు సానుభూతి చెబుతున్నట్లు ప్రకటించారు.
ముఖ్యంగా పౌర నివాసాలు, సదుపాయాలే లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులకు పాల్పడుతోందని, అందుకే తమకు వీలైనంత ఎక్కువ గగనతల రక్షణ వ్యవస్థలను వేగంగా అందజేయాలని జెలెన్స్కీ మిత్రదేశాలను కోరారు. ఉక్రెయిన్ పౌరులు రక్షణ ప్యాకేజీలపై నేరుగా ఆధారపడి ఉన్నారని జెలెన్స్కీ చెప్పారు.

More Stories
నేపాల్ జల విద్యుత్ సొరంగాల్లో భారత్, చైనా సైనిక నిపుణుల అన్వేషణ
ఎస్సీవో సదస్సులో మోదీ ఫొటో కట్ చేసిన పాక్ ప్రధాని కార్యాలయం
రష్యా సైన్యంలోని 51 మంది భారతీయుల మృతి