రష్యా సైన్యంలోని 51 మంది భారతీయుల మృతి

రష్యా సైన్యంలోని 51 మంది భారతీయుల మృతి
రష్యా మిలిటరీలో చేరి ఉక్రెయిన్ సరిహద్దుల్లో పనిచేస్తున్న భారత పౌరులకు సంబంధించిన విషాదకర వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపిన వివరాల ప్రకారం, రష్యా ఆర్మీలో చేరిన మొత్తం 227 మంది భారతీయులలో ఇప్పటివరకు 51 మంది ఉక్రెయిన్ తీవ్ర యుద్ధ పోరాటంలో మరణించారు. 
 
ఉద్యోగాల పేరుతో ఏజెంట్ల ద్వారా మోసపోయి రష్యా ఆర్మీకి సహాయక సిబ్బందిగా వెళ్లిన వీరు ఊహించని విధంగా యుద్దరంగంలో చిక్కుకుపోయారు. ఈ పరిస్థితిపై స్పందించిన భారత ప్రభుత్వం, రష్యా అధికారులతో చర్చలు జరిపి ఇప్పటివరకు 139 మంది భారతీయులను విడిపించడంలో విజయం సాధించింది. త్వరలోనే ఈ 139 మందిని సురక్షితంగా భారతదేశానికి రప్పించి వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని విదేశాంగ శాఖ తెలిపింది.

ఈ అంశంలో రష్యాతో వివిధ స్థాయిల్లో చర్చలు జరుగుతున్నాయని మిశ్రీ చెప్పారు. మాస్కోలోని భారతీయ ఎంబసీ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ భారతీయులను వెనక్కు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు.  రష్యా సైన్యంలోని వివిధ మిలిటరీ యూనిట్లలో ఇంకా సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న మిగిలిన భారతీయులను కూడా వెంటనే డిశ్చార్జ్ చేసి విడుదల చేయాలని రష్యా ప్రభుత్వాన్ని భారత్ గట్టిగా కోరినట్లు చెప్పారు. 

అధిక జీతాలు, విదేశీ ఉద్యోగాల పేరుతో ఆశచూపి రష్యాలోని ఆర్మీ సపోర్ట్ ఉద్యోగాల పేరుతో అమాయక యువతను మోసం చేస్తున్న నిరుద్యోగ నకిలీ ఏజెన్సీలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని విదేశాంగ శాఖ ప్రజలను హెచ్చరించింది. ఇటువంటి అక్రమ రిక్రూట్‌మెంట్లు నిర్వహించే ఏజెంట్లపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని, విదేశాలకు వెళ్లే ముందు భారత ప్రభుత్వం ఆమోదించిన అధికారిక మార్గాల ద్వారా మాత్రమే ఉద్యోగ అవకాశాలను ఎంచుకోవాలని స్పష్టం చేసింది.