ఇటీవలే ఎనిమిదోసారి ఆసియా కప్‌ను ఒడిసిపట్టిన భారత మహిళల జట్టు ఆసియా క్రీడల్లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం రెండో సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై ఓపెనర్ షఫాలీ వర్మ(100 నాటౌట్) మెరుపు శతకంతో విరుచుకుపడగా అలవోకగా పసిడి పోరుకు అర్హత సాధించింది టీమిండియా. 196 పరుగుల ఛేదనలో ఏమాత్రం పోటీఇవ్వని బంగ్లా 81 పరుగులకే ఆలౌటైంది.
దీప్తి శర్మ(3-7), నందిని శర్మ(3-25)లు చెలరేగగా,114 రన్స్ తేడాతో నెగ్గిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన దర్జాగా ఫైనల్ చేరింది. ఫెండింగ్ ఛాంపియన్‌గా ఆసియా క్రీడల్లో అడుగుపెట్టిన భారత జట్టు అదిరే ఆటతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో జపాన్ను చిత్తుగా ఓడించిన టీమిండియ, సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. టాస్ గెలిచిన బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా 195-4 పరుగులు చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ (100) సెంచరీతో రఫ్పాడించింది.
అనంతరం 196 లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 81 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇక సెప్టెంబర్ 22న జరగనున్న గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ తలపడనుంది. తొలుత ఓపెనర్ షఫాలీ వర్మ(100 నాటౌట్: 49 బంతుల్లో 3 ఫోర్లు, 9 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్‌తో సగం ఓడిన బంగ్లా.. బ్యాటర్ల తడబాటుతో 15.4 ఓవర్లలోనే మ్యాచ్‌నూ అప్పగించేసింది. బిగ్ మ్యాచ్ ప్లేయర్‌గా అవతరించిన షఫాలీ వర్మ సెమీఫైనల్లో రెచ్చిపోయింది.
బంగ్లాదేశ్ బౌలర్లను బెంబేలెత్తిస్తూ ఓపెనర్ స్మృతి మంధాన(37)తో కలిసి శుభారంభమిచ్చింది. తొలి వికెట్‌కు 72 రన్స్ జోడించిన ఈ ద్వయాన్ని నహిదా అక్తర్ విడదీసింది. మంధాన ఔటయ్యాక కమలిని(3) నిరాశపరిచింది. కానీ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(40) జతగా షఫాలి బౌండరీలతో విరుచుకుపడింది. ఆఖరి వరకు క్రీజులో నిలిచిన తను.. భారత జట్టుకు 195 పరుగుల భారీ స్కోరందించింది.
టీమిండియా నిర్దేశించిన 196 పరుగుల భారీ ఛేదనలో బంగ్లా ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. ప్రత్యర్థిని టాపార్డర్‌ను దీప్తి శర్మ(3-7), బర్త్ డే గర్ల్ నందిని శర్మ(3-25) వణికించారు. వీరిద్దరూ చెరో మూడేసి వికెట్లతో చెలరేగగా.. బంగ్లా 81 పరుగులకే కుప్పకూలింది. దాంతో 114 పరుగుల భారీ విజయంతో ఫైనల్లో అడుగుపెట్టింది భారత్. తొలి సెమీస్‌లో గెలుపొందిన శ్రీలంకను పసిడి పోరులో టీమిండియా ఢీకొట్టనుంది. సెప్టెంబర్ 22 మంగళవారం ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.

More Stories
రష్యాపై వేయి డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయన్.. ఇద్దరు మృతి
హెచ్-1బీ వీసా దరఖాస్తులపై మరో ఏడాది పాటు లక్ష డాలర్ల ఫీజు
నౌకల స్వేచ్ఛాయుత ప్రయాణ హక్కులను ఎవరూ అడ్డుకోరాదు