కెరీర్‌ ముసుగులో కుటుంబ వ్యవస్థను నాశనం చేసుకోవద్దు

కెరీర్‌ ముసుగులో కుటుంబ వ్యవస్థను నాశనం చేసుకోవద్దు

ఆధునిక జీవన విధానం, కెరీర్‌ అభివృద్ధి, ఆర్థిక ప్రగతి పేరుతో కుటుంబ వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్‌ తరాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని విశ్వహిందూ పరిషత్ తెలుగు రాష్ట్రాల క్షేత్ర సంఘటన మహామంత్రి గుమ్మల్ల సత్యం హెచ్చరించారు. కెరీర్‌ ఎంత ముఖ్యమో కుటుంబం కూడా అంతే ముఖ్యమని, వ్యక్తిగత అభివృద్ధితో పాటు కుటుంబం, సమాజం పట్ల బాధ్యతను యువత గుర్తించాలని పిలుపునిచ్చారు.

తెలంగాణలోని పరిషత్ బాధ్యతాయుతమైన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ “కెరీర్‌ కోసం కుటుంబాన్ని వాయిదా వేస్తూ పోతే ఒక దశలో కుటుంబమే లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. ఆస్తులు సంపాదించడం మాత్రమే జీవిత లక్ష్యం కాదు. విలువలతో కూడిన కుటుంబాన్ని నిర్మించడం, పిల్లలను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడం కూడా ప్రతి వ్యక్తి బాధ్యత” అని  చెప్పారు.

యువత సరైన సమయంలో వివాహం చేసుకొని కుటుంబ జీవితానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. కుటుంబ వ్యవస్థ బలహీనపడితే దాని ప్రభావం వ్యక్తిపైనే కాకుండా మొత్తం సమాజంపై పడుతుందని పేర్కొన్నారు. జనాభా సమతుల్యతపై సమాజంలో చైతన్యం అవసరమని, భవిష్యత్‌ తరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి కుటుంబం తమ పరిస్థితులు, సామర్థ్యాలకు అనుగుణంగా బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకోవాలని సత్యం తెలిపారు.

“చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కాదు.. సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కార మార్గాలను అన్వేషించాలి” అని ఆయన పేర్కొన్నారు. కుటుంబ విలువలు, వివాహ వ్యవస్థ, సంస్కారం, సామాజిక బాధ్యత వంటి అంశాలపై యువతలో విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

హిందూ సమాజంలో ఐక్యతను బలోపేతం చేయడం, మతమార్పిడులపై చైతన్యం కల్పించడం, మహిళలు, యువతకు ఎదురవుతున్న సామాజిక సమస్యలపై అవగాహన పెంచడం, కుటుంబ వ్యవస్థను పరిరక్షించడం వంటి అంశాలపై మరింత విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. హిందూ సమాజం భవిష్యత్తు కేవలం ప్రభుత్వాల చేతుల్లోనే లేదని, ప్రతి కుటుంబం, ప్రతి తల్లిదండ్రి, ప్రతి యువకుడు, ప్రతి యువతి తమ సామాజిక బాధ్యతను గుర్తించినప్పుడే సమాజం బలపడుతుందని సత్యం తెలిపారు.

“బలమైన కుటుంబం – బలమైన సమాజం – బలమైన దేశం” అనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పరిషత్‌ను గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు మరింత బలోపేతం చేయడం, హిందూ సమాజంలో ఐక్యతను పెంపొందించడం, సామాజిక సేవా కార్యక్రమాలను విస్తరించడం, రాబోయే కార్యక్రమాలకు కార్యాచరణ రూపొందించడం వంటి అంశాలపై సమావేశంలో కూలంకషంగా చర్చించారు.

రాష్ట్ర అధ్యక్షులు నరసింహమూర్తి,  కార్యదర్శి లక్ష్మీనారాయణ,  ఉపాధ్యక్షులు సునీత రెడ్డి,  సహ కార్యదర్శులు చింతల వెంకన్న, రమేష్, ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.