కర్ణాటకలో `ఆర్ఎస్ఎస్ ఉపాధ్యాయుల’ వేటుపై పై బిజెపి మండిపాటు

కర్ణాటకలో `ఆర్ఎస్ఎస్ ఉపాధ్యాయుల’ వేటుపై పై బిజెపి మండిపాటు
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నిర్వహించిన కవాతుల్లో (రూట్ మార్చ్‌లలో) పాల్గొన్నందుకు ఇద్దరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను సస్పెండ్ చేసిన కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ శుక్రవారం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ఈ సస్పెన్షన్ చర్యను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.

కర్ణాటక ప్రభుత్వం ‘ద్వేషపూరిత’ ధోరణితోనే ఇలా వ్యవహరించిందని ఆరోపిస్తూ సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి “కక్షపూరిత” చర్యలకు స్వస్తి పలకాలని ఆయన సూచించారు.  “కేవలం గత 10-12 ఏళ్లలోనే కాదు, 1970లు, 80ల నాటి నుంచీ సంఘ్ కార్యకలాపాల్లో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకున్నప్పుడల్లా, లేదా సంఘ్ కార్యకలాపాలను ఏదో ఒక విధంగా అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా న్యాయస్థానాలు వాటిని కొట్టివేస్తూనే వచ్చాయి,” అని ఆయన గుర్తు చేశారు.

కర్ణాటకలోనూ, కేంద్రంలోనూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న జనతాదళ్ (సెక్యులర్)కు చెందిన కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి కూడా కాంగ్రెస్‌ను విమర్శించారు. ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఆ ఉపాధ్యాయులు చేసిన తప్పేమిటని ఆయన ప్రశ్నించారు.  “అది సమస్య కాదు. వారు చేసిన తప్పేంటి? ఆర్ఎస్ఎస్ సమావేశానికి హాజరవడంలో ఏమైనా సమస్య ఉందా? ఏమైనా నష్టం జరిగిందా? హింస చెలరేగిందా?” అని ఆయన నిలదీశారు.

యాద్గిర్ జిల్లాకు చెందిన ఇద్దరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు—హునసాగీలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల అసిస్టెంట్ టీచర్ గురురాజ్ జోషి, సుర్పుర్ తాలూకాలోని కుప్పీ ప్రభుత్వ లోయర్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు అన్నా సాహెబ్ దేశ్‌ముఖ్ ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కర్ణాటక విద్యాశాఖ గురువారం వారిని సస్పెండ్ చేసింది.

ఆర్ఎస్ఎస్ నిర్వహించిన ‘పథ సంచలన’ (కవాతు)లో వారి భాగస్వామ్యం ప్రాథమికంగా ‘కర్ణాటక సివిల్ సర్వీసెస్ (ప్రవర్తన) నియమావళి-2021’ నిబంధనలను ఉల్లంఘించిందని విద్యాశాఖ భావించింది. కాంగ్రెస్ పార్టీ ఈ చర్యను సమర్థించుకుంటూ, ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉండాలని పేర్కొంది.
“ఎవరైనా ఫిర్యాదు చేసి, శాఖ గనుక అది తప్పని భావిస్తే, వారు చర్య తీసుకుంటారు. నమోదు కాని సంస్థ కార్యక్రమాల్లో మన ఉద్యోగులు ఎందుకు పాల్గొనాలి?” అని కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే ప్రశ్నించారు.