తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తప్పుడు పత్రాలు లేదా నకిలీ సమాచారాన్ని సమర్పిస్తే చట్టపరమైన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సిఈఓ) సి. సుదర్శన్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. నమోదు సమయంలో, వ్యక్తిగత విచారణ సందర్భంలో ఇచ్చే డిక్లరేషన్లు సరైనవిగా ఉండాలని స్పష్టం చేశారు
ఓటర్లు అందించిన పత్రాలను, వివరాలను అధికారులు స్వతంత్రంగా తనిఖీ చేసి ధ్రువీకరిస్తారు. ఇందులో ఎలాంటి అక్రమాలు వెలుగుచూసినా క్రింది చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటారు. భారతీయ న్యాయసంహిత (బిఎన్ఎస్) సెక్షన్ 217 ప్రకారం ప్రభుత్వ అధికారికి ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని లేదా నకిలీ ఆధారాలను అందించడం నేరం.
ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 సెక్షన్ 31 ప్రకారం ఓటర్ల జాబితా సవరణ, చేరికలు లేదా తొలగింపులు సమయంలో తప్పుడు డిక్లరేషన్ ఇస్తే జైలు శిక్ష, జరిమానా లేదా రెండు విధించవచ్చని స్పష్టం. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణలో భాగంగా ఇప్పటికే 2 లక్షల మందికి పైగా నోటీసులు అందగా, మొత్తం 92.8 లక్షల మంది ఓటర్లకు నోటీసులు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. వారిలో 60.5 లక్షల మంది నమోదు డేటాలో వ్యత్యాసాలు ఉన్నవారు. 32.2 లక్షల మంది 2002 ఓటర్ల జాబితా వివరాలతో లింకేజీ సరిపోలని ఓటర్లు.
నోటీసులు అందుకున్న ఓటర్లు, వారి కుటుంబ సభ్యులు నిర్దేశిత సమయానికి విచారణాధికారి వద్ద వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంటుంది. ఓటర్లు తమకు నోటీస్ వచ్చిందో లేదో తెలుసుకోవడానికి పాయింట్ ఆన్ పోర్టల్లో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయి, తమ ఎపిక్ (ఈపిఐసి) నంబర్ నమోదు చేసి ఓటిపి ద్వారా వివరాల స్థితిని స్వయంగా ధ్రువీకరించుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

More Stories
సృజనోత్సవ్లో స్విస్ ప్రభంజనం.. భాషా సాంస్కృతిక శాఖ సత్కారం
వీరబైరాన్పల్లి పోరాట స్ఫూర్తి ఘట్టం భావితరాలకు స్ఫూర్తి
తెలంగాణలో ఎమర్జెన్సీ తరహా కాంగ్రెస్ నిరంకుశ పాలన