75 శాతం ప్రభుత్వ బడుల్లో కనిపించని కంప్యూటర్లు

75 శాతం ప్రభుత్వ బడుల్లో కనిపించని కంప్యూటర్లు

దేశంలో డిజిటల్‌ అక్షరాస్యత లక్ష్యంగా జాతీయ విద్యావిధానం(ఎన్‌ఈపీ) తీసుకొచ్చి ఏండ్లు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తున్నది. కేంద్ర విద్యాశాఖకు చెందిన తాజా ‘యుడైస్‌ ప్లస్‌’ 2025-26 నివేదిక ప్రకారం దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 75శాతం పాఠశాలల్లో డెస్క్‌టాప్‌ కంప్యూటర్లు అందుబాటులో లేవు.  దేశవ్యాప్తంగా ఉన్న 10, 05,245 ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం 2,56,165 బడుల్లోనే (25.5శాతం) పనిచేసే డెస్క్‌టాప్‌లు ఉన్నాయి. 

ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో 63.2శాతం కంప్యూటర్‌ సౌకర్యం ఉండగా, ప్రభుత్వ బడులు భారీగా వెనుకబడి ఉన్నాయి. గత నాలుగేండ్లలో (2022-23 నుంచి 2025-26 వరకు) ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ల లభ్యత కేవలం 5.3శాతం మాత్రమే పెరిగింది. అలాగే కేవలం 11.7శాతం పాఠశాలల్లో మాత్రమే ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉన్నాయి. 

రాష్ర్టాల వారీగా పరిశీలిస్తే యూపీలో కేవలం 8,821(6.4శాతం) పాఠశాలల్లోనే కంప్యూటర్లు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌(7.6శాతం), మేఘాలయ(7.6శాతం) , బీహార్‌(9.5శాతం), అస్సాం(13.1శాతం), ఛత్తీస్‌గఢ్‌(13.2శాతం), జార్ఖండ్‌(13.3 శాతం), ఒడిశా(17.1శాతం), ఆంధ్రప్రదేశ్‌(17.6శాతం), పశ్చిమ బెంగాల్‌ (18.4శాతం) రాష్ర్టాలు అట్టడుగున నిలిచాయి. 

మరోవైపు పంజాబ్‌(95.2శాతం), తమిళనాడు(85.8శాతం), సిక్కిం(71.9 శాతం), గుజరాత్‌(68.8శాతం), ఉత్తరాఖండ్‌(66.1శాతం) రాష్ర్టాలు మెరుగైన ఫలితాలు సాధించాయి.