తెలంగాణలో ఎమర్జెన్సీ తరహా కాంగ్రెస్ నిరంకుశ పాలన

తెలంగాణలో ఎమర్జెన్సీ తరహా కాంగ్రెస్ నిరంకుశ పాలన

* హౌస్ అరెస్టుపై రాంచందర్ రావు ఆగ్రహం 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ తరహా మైండ్‌సెట్‌తో ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన సాగిస్తోందని, సమస్యలపై గళమెత్తే ప్రతిపక్షాలు, విద్యార్థులపై పోలీసు నిర్బంధాలను ప్రయోగిస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను చేపట్టిన నిరాహార దీక్షా శిబిరానికి స్వయంగా వచ్చి తమ సమస్యలు చెప్పుకున్న రామంతపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులను పరామర్శించేందుకు, వారికి మద్దతు తెలిపేందుకు బయల్దేరిన ఆయనను తార్నాకలోని నివాసంలో పోలీసులు ఉదయం  హౌస్ అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ  విద్యార్థుల పక్షాన నిలబడాల్సిన బాధ్యతగల ఒక రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని, విద్యార్థులను కలవకుండా ఇంటి చుట్టూ భారీగా పోలీసులను మోహరించి అడ్డుకోవడం ప్రభుత్వ పిరికితనానికి పరాకాష్ట అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఒకవైపు లక్షలాది మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు ఇవ్వకుండా ఆగం చేస్తుంటే, మరోవైపు ఆయుష్ విద్యార్థులకు, జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్లు సక్రమంగా ఇవ్వట్లేదని విమర్శించారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో పీజీ విద్యార్థులకు నెలకు రూ. 26 వేలు, సూపర్ స్పెషాలిటీ వారికి రూ. 30 వేల వరకు స్టైఫండ్లు ఇస్తుంటే, తెలంగాణలో మాత్రం అందులో సగం కూడా ఇవ్వకుండా కేవలం రూ. 13 వేల నుంచి రూ. 15 వేలకే పరిమితం చేసి విద్యార్థుల పొట్టకొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును జీవో 97 ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘శక్తి స్కీమ్’ పేరుతో వింత ప్రయోగాలు చేస్తూ, సాంకేతిక విద్యను కేవలం నామమాత్రపు స్కిల్ డెవలప్‌మెంట్‌గా మార్చి, పాలిటెక్నిక్ విద్యార్థుల చదువును అవమానపరుస్తున్నారని విమర్శించారు.

పాలిటెక్నిక్ పూర్తయిన విద్యార్థులకు ఇంజనీరింగ్‌లో ప్రవేశానికి ఉన్న ఈసెట్ అవకాశాలను దూరం చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే వారిపై లాఠీఛార్జీలు చేయించడం, అక్రమ కేసులు పెట్టడం దారుణమని చెప్పారు. ఈ సమస్యపై ప్రభుత్వం వేసిన హైలెవల్ కమిటీ కేవలం కంటితుడుపు చర్య మాత్రమేనని స్పష్టం చేశారు.
 
 కంటితుడుపు కమిటీలతో కాలయాపన చేయకుండా పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే జీవో 97ను బేషరతుగా తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖను తనవద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో విద్యార్థులు పడుతున్న గోడును పట్టించుకోకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక, విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు, లెక్చరర్లు లేక ఉన్నత విద్య సైతం భ్రష్టుపట్టిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.