తెలంగాణ విమోచన చరిత్రను భావితరాలకు.. బిజెపి 7 డిమాండ్లు 

తెలంగాణ విమోచన చరిత్రను భావితరాలకు.. బిజెపి 7 డిమాండ్లు 

తెలంగాణ ప్రాంతం దశాబ్దాలుగా వివక్షకు, అణచివేతకు గురైందని, దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల రక్త చరిత్ర నుంచి తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17నే విమోచనం లభించిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ డా. బూర నర్సయ్య గౌడ్ స్పష్టం చేశారు. నిజాం పాలన కింద ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో సెప్టెంబర్ 17ను ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తుంటే, పోరాటానికి కేంద్రబిందువైన తెలంగాణలో మాత్రం అమరవీరులకు అధికారిక గుర్తింపు ఇవ్వకపోవడం చారిత్రక అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సెప్టెంబర్ 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ విమోచన చరిత్ర, అమరవీరుల త్యాగాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విస్తృత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఇది రాజకీయాలకు, పార్టీలకు, మతాలకు అతీతంగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాటం అని చెప్పారు. తెలంగాణ విమోచన చరిత్రను భావితరాలకు అందించేందుకు, అమరవీరులకు సముచిత గౌరవం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని స్పష్టం చేస్తూ  ఈ సందర్భంగా తెలంగాణ విమోచన సాధన కోసం బీజేపీ తరఫున 7 ప్రధాన డిమాండ్లను ఆయన రాష్ట్ర ప్రభుత్వం ముందుంచిన్నట్లు అయన వెల్లడించారు. 

1. సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలి.
2. విమోచన ప్రదాత సర్దార్ వల్లభభాయ్ పటేల్ భారీ స్మారక చిహ్నం ‘స్టాచ్యూ ఆఫ్ లిబరేషన్ – తెలంగాణ’ను హైదరాబాద్‌లో నెలకొల్పాలి.
3. అంతర్జాతీయ ప్రమాణాలతో ‘తెలంగాణ విమోచన మ్యూజియం’ ఏర్పాటు చేయాలి.
4. ప్రతి జిల్లా కేంద్రంలో ‘తెలంగాణ విమోచన స్మృతి కేంద్రం’ నిర్మించాలి.
5. తెలంగాణ విమోచన చరిత్రను అధికారిక పాఠ్యపుస్తకాలలో చేర్చాలి.
6. అమరవీరులు, ఉద్యమకారుల సమగ్ర జాబితాను రూపొందించి వారికి, వారి కుటుంబాలకు తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వాలి.
7. వీరభైరాన్‌పల్లి, పరకాల (డెక్కన్ జలియన్‌వాలాబాగ్), కడవెండి, జోడేఘాట్, నిర్మల్, నల్గొండ వంటి చారిత్రక ప్రాంతాలను కలుపుతూ ‘తెలంగాణ విమోచన పర్యాటక సర్క్యూట్’ను అభివృద్ధి చేయాలి.*

అదేవిధంగా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం బీజేపీ 5 కీలక ప్రతిజ్ఞలను ప్రకటించిందని తెలిపారు:

1. రజాకార్ రాజకీయ వారసత్వ కలయిక అయిన ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ కూటమికి చరమగీతం పాడటం.
2. శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రమంతటా పన్నులు, చట్టాల అమలులో సమానత్వం ఉండేలా “ఒకే రాష్ట్రం – ఒకే రూల్” విధానాన్ని తీసుకురావడం.
3. తరతరాలుగా కొనసాగుతున్న గడీల, కుటుంబ రాజకీయాలకు ముగింపు పలికి నిజమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడం.
4. వేల కోట్ల అవినీతి, అరాచకం, అణచివేత పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించడం.
5. ఆత్మగౌరవంతో కూడిన సంపూర్ణ అభివృద్ధి చెందిన తెలంగాణను బీజేపీ ద్వారానే సాధించడం.*

ఈ ఉద్యమ కార్యాచరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్స్‌లో అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహించింది. అదేవిధంగా ఈ ఆగస్టు 27న వీరభైరాన్‌పల్లిలో, సెప్టెంబర్ 2న పరకాల అమరధామంలో అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, సెప్టెంబర్ 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. 

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఓటు బ్యాంకు, సంతుష్టికరణ రాజకీయాల కోసం ఎంఐఎంకు తలొగ్గి చారిత్రక వాస్తవాలను వక్రీకరిస్తున్నాయని, మరోవైపు కమ్యూనిస్టు పార్టీలు కూడా తమ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టాయని ఆరోపించారు.