నేపాల్‌కు రాష్ట్రపతి, ప్రధాని సంఘీభావం.. భారత్ అప్రమత్తం

నేపాల్‌కు రాష్ట్రపతి, ప్రధాని సంఘీభావం.. భారత్ అప్రమత్తం
* 10 టన్నుల మానవతా సాయం.. వైమానిక దళం రవాణా విమానాలు సిద్ధం 
నేపాల్‌లో ఆకస్మిక వరదలు సృష్టించిన విధ్వంసంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ దేశ అధ్యక్షుడు రామచంద్ర పౌడల్‌కు, దేశ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితిలో నేపాల్‌కు భారత్ అండగా నిలుస్తుందని ఆమె భరోసా ఇచ్చారు. ఈ విపత్తుతో ప్రభావితమైన వారికి సహాయ, రక్షణ చర్యల్లో నేపాల్ ప్రభుత్వం చేపట్టే ప్రయత్నాలకు మద్దతు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో రాష్ట్రపతి తెలిపారు. 

ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్‌ ప్రధాని బాలేంద్ర షాతో ఫోన్‌లో మాట్లాడి అవసరమైన అన్ని సహాయసహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో నేపాల్‌ ప్రజలకు భారతీయులంతా అండగా ఉంటారని మోదీ హామీ ఇచ్చారు.  నేపాల్‌కు అవసరమైన అన్ని రకాల మానవతా సాయం అందించేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

సహాయక చర్యలు, సహాయ బృందాల సమన్వయంపై ఇరు దేశాల బృందాలు సన్నిహితంగా పనిచేస్తున్నాయని తెలుపుతూ ఎక్స్లో పోస్ట్ చేశారు. మరోవంక, వరద బాధిత నేపాల్‌కు భారత్‌ అత్యవసర సాయాన్ని పంపేందుకు సిద్ధమైంది.  వినాశకరమైన వరదల అనంతరం సహాయక చర్యలకు మద్దతుగా భారతదేశం ఆ దేశంలో జరుగుతున్న సహాయక చర్యలకు మద్దతుగా  తన మానవతా సాయాన్ని ముమ్మరం చేసింది.

ఇందులో భాగంగా, అత్యవసర మందులతో పాటు 10 టన్నుల మానవతా, విపత్తు సహాయక సామగ్రిని భారత వాయుసేన విమానాల ద్వారా అక్కడికి పంపింది.  దీనిని రాయబారి నవీన్ శ్రీవాస్తవ, సంస్కృతి, పర్యాటక, పౌర విమానయాన శాఖ మంత్రి ఖడక్ రాజ్ పౌడెల్‌కు అందజేశారు.  . భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. నేపాల్‌కు అవసరమైన అత్యవసర సహాయం, వైద్య బృందాలు ఖాఠ్మండు చేరుకున్నాయని తెలిపారు. 

భారత వాయుసేనకు చెందిన ‘సీ-130జే’ రవాణా విమానం ద్వారా 10 టన్నుల సహాయక సామగ్రిని అత్యవసరంగా నేపాల్‌కు తరలించారు. ఇందులో టెంట్లు, దుప్పట్లు, హైజీన్ కిట్లు, సోలార్ లాంతర్లు, ప్రాణాలను రక్షించే ముఖ్యమైన మందులు ఉన్నాయి. వరద ప్రభావిత నేపాల్‌లో అవసరమైతే చేపట్టే సహాయక చర్యల కోసం భారత వైమానిక దళం తన రవాణా విమానాలను సిద్ధంగా ఉంచింది.
 
ఈ విమాన శ్రేణిలో సి-17, సి-130జె, సి-295 రవాణా విమానాలు ఉన్నాయి. సమాచారం ప్రకారం, సహాయక సామగ్రితో కూడిన ఒక సి-130జె విమానం బుధవారం సాయంత్రం వేళ నేపాల్‌కు బయలుదేరే అవకాశం ఉంది,  పరిస్థితిని బట్టి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) సిబ్బందిని కూడా నేపాల్‌కు పంపే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో గాలింపు, రక్షణ, సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

భారీ వరదల నేపథ్యంలో భారత్‌ కూడా అప్రమత్తమైంది. భారత్‌-నేపాల్‌ మధ్య ఉన్న 1,751 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సశస్త్ర సీమా బల్‌ (ఎస్ఎస్బీ) తన అన్ని విభాగాలను అప్రమత్తం చేసింది. సహాయ, రక్షణ చర్యల కోసం మొత్తం 18 బృందాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు. వీటిలో ఏడు బృందాలను అత్యవసర పరిస్థితుల్లో రంగంలోకి దించేందుకు సిద్ధంగా ఉంచారు. 

కోషి, నారాయణి నదీ పరివాహక ప్రాంతాల్లో నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందన్న వాతావరణ అంచనాల నేపథ్యంలో ఎస్ఎస్బీ అప్రమత్తంగా ఉంది. నేపాల్‌లోని చిన్న నదుల్లోనూ ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. భారత్‌లోనూ ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లోని ఘఘ్రా/కర్ణాలి, మహాకాళీ నదీ వ్యవస్థలకు ఆనుకుని ఉన్న సున్నిత ప్రాంతాలపై నిఘా పెంచారు. వరద పరిస్థితులు, నీటి ప్రవాహాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.