* సాధారణంగా వాటంతట అవే తగ్గిపోతాయి.. ఐసీఎంఎంఆర్
దేశ రాజధాని ఢిల్లీతో పాటు కర్ణాటక రాష్ట్రంలో ‘హెచ్1ఎన్1’ (స్వైన్ ఫ్లూ) వైరస్ వేగంగా విస్తరిస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. కర్ణాటకలో ఈ నెల 22వ తేదీ నాటికే కేసుల సంఖ్య ఏకంగా 4,212కు చేరుకోగా, ఢిల్లీలో 3,000 మార్కును దాటేసింది. అనూహ్యంగా కేసులు పెరుగుతున్నప్పటికీ, పరిస్థితి ప్రస్తుతం నియంత్రణలోనే ఉందని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
సీజనల్ మార్పుల వల్ల వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ బాధితుల్లో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, శరీరం నొప్పులు మరియు అలసట వంటి ప్రాథమిక లక్షణాలు కనిపిస్తున్నట్లు వైద్యాధికారులు స్పష్టం చేశారు. కాగా, భారతదేశంలో ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న శ్వాసకోశ వ్యాధులకు హెచ్1ఎన్1 వైరస్ రకమే ప్రధాన కారణమని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ రాజీవ్ బాల్ వెల్లడించారు.
తాము పరీక్షించిన ఇన్ఫ్లూయెంజా-ఏ కేసుల్లో దాదాపు 98 శాతం ఈ వైరస్ రకానికే చెందినవని ఆయన తెలిపారు. వైరస్ల వ్యాప్తిని ఎప్పటికప్పుడు కనిపెట్టేందుకు, భారతదేశం ఒక బహుళ అంచెల, రియల్ టైమ్ వ్యాధి నిఘా నెట్వర్క్ను ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. ఈ నిఘా వ్యవస్థ రాష్ట్ర స్థాయి డేటాను ‘సమీకృత ఆరోగ్య సమాచార వేదిక’ (ఐహెచ్ఐపీ), ‘జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం(ఎన్సీడీసీ)తో అనుసంధనం చేస్తుందని తెలిపారు.
దీనితోపాటు ఐసీఎంఆర్ నేరుగా ఆసుపత్రుల నుంచి సేకరించిన శాంపిల్స్ ద్వారా హెచ్1ఎన్1 వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు పెరుగుదలను తక్షణమే గుర్తించి, నివారణ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ హెచ్1ఎన్1 వైరస్ లాంటి పర్రతి సిండ్రోమ్లను కనిపెట్టడం కోసం, మేము దేశమంతటా 73 ల్యాబ్లు/ ఆసుపత్రుల ద్వారా ఐసీఎంఆర్ సెంటినెల్ నిఘాను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇది ఎన్సీడీసీ కంటే పై స్థాయిలో జరుగుతుందని రాజీవ్ బాల్ తెలిపారు.ఇతర శ్వాసకోశ వైరస్లతో పోలిస్తే హెచ్1ఎన్1 ఇన్ఫెక్షన్లు దేశవ్యాప్తంగా విపరీతంగా పెరుగుతున్నాయని పేర్కొంటూ అదే సమయంలో కరోనా కేసులు స్థిరంగా తగ్గుముఖం పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే హెచ్1ఎన్1తో కూడిన ఈ సీజనల్ ఇన్ఫ్లూయెంజా సాధారణంగా దానింతట అదే తగ్గిపోతుందని ఐసీఎంఆర్ ప్రకటించింది. జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు దీని సాధారణ లక్షణాలు అని పేర్కొంది. సరైన వైద్యం, రక్షణ, విశ్రాంతి ఉంటే చాలా వరకు ఈ వ్యాధి నుంచి కోలుకోవచ్చని స్పష్టం చేసింది.

More Stories
ఆగష్టు 31న నేవీలో చేరనున్న దేశీయ ఐఎన్ఎస్ నిపుణ్
హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరేం కాదు
శతాబ్దానికిపైగా ఎన్నడూ లేనంతగా ఎల్నినో ప్రభావం