కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు సంబంధించిన ఆరోపణలపై ప్రణాళిక, గణాంకాల శాఖ మంత్రి బి. నాగేంద్ర రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కర్ణాటక విధానసౌధ వెలుపల నిరసన చేపట్టిన బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో, అక్కడ ఒక పెద్ద రాజకీయ ఘర్షణ చెలరేగింది.
ప్రతిపక్ష పార్టీ తమ “విధానసౌధ ముట్టడి” నిరసనలో భాగంగా రాష్ట్ర శాసనసభలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించింది. పోలీసులు నిరసనకారులను గేట్ల వద్దే అడ్డుకోవడంతో, భద్రతా సిబ్బందికి, బీజేపీ కార్యకర్తలకు మధ్య ఉద్రిక్త వాగ్వాదాలు, తోపులాటలు చోటుచేసుకున్నాయి.
నిరసనకారులను ప్రాంగణంలోకి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకోవడంతో, రాష్ట్ర అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోకలతో సహా పలువురు సీనియర్ బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. వాల్మీకి కార్పొరేషన్ నిధులకు సంబంధించిన అవకతవకలపై బీజేపీ తన ఆందోళనను తీవ్రతరం చేసింది.
నాగేంద్రపై చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. షెడ్యూల్డ్ తెగల సంక్షేమం కోసం ఉద్దేశించిన రూ. 187 కోట్లను కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల సంబంధిత ప్రయోజనాల కోసం మళ్లించారని ఆ పార్టీ ఆరోపించింది. వాల్మీకి కార్పొరేషన్‌కు చెందిన డబ్బును “దోచుకున్నారని” ఆర్. అశోక ఆరోపిస్తూ ఆ నిధులను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
“మేము మంత్రి నాగేంద్ర కారణంగా నిరసన తెలుపుతున్నాము. ఆయన వాల్మీకి కార్పొరేషన్ నుండి సుమారు రూ. 180 కోట్లు దోచుకున్నారు. ఈ డబ్బును ప్రజలకు తిరిగి ఇవ్వాలి. అందుకే మేము విధానసౌధ ముందు నిరసన తెలుపుతున్నాము,” అని అశోక తెలిపేరు. ప్రతిపక్షాల నిరసనలను అణచివేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు చర్యను ఉపయోగిస్తోందని కూడా ఆయన ఆరోపించారు.
“ప్రభుత్వం ఈ స్థాయి చర్యలకు పాల్పడితే, అది మంచిది కాదు. మేము నిశ్శబ్దంగా నిరసన తెలుపుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మాపై దాడి చేస్తుంది. ఇది మంచిది కాదు. మా ఆందోళన కొనసాగుతుంది. మాకు మంత్రి నాగేంద్ర రాజీనామా కావాలి,” అని ఆయన స్పష్టం చేశారు.
నిరసనకారులలో ఒక పెద్ద బృందం నినాదాలు చేస్తూ, కాషాయ కండువాలు ఊపుతూ వికాససౌధ వైపు నుండి ప్రవేశించడానికి ప్రయత్నించింది. పోలీసులు వారి కదలికలను అడ్డుకుని, అనంతరం మహిళలతో సహా పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు చాలవాడి నారాయణస్వామి, ఇతర సీనియర్ బీజేపీ నాయకులతో కలిసి ఫ్రీడమ్ పార్క్ వద్ద మరో నిరసన చేపట్టారు. బీజేపీ ఎమ్మెల్సీ ఎన్. రవికుమార్ నేతృత్వంలోని ఒక నిరసనకారుల బృందంలో ఎమ్మెల్సీ సి.టి. రవి, ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

More Stories
`ఒకే దేశం, ఒకే ఎన్నిక’కు 99 శాతం మంది మద్దతు
పంజాబ్‌లో అన్ని స్థానాల్లో బిజెపి ఒంటరిగానే పోటీ
‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’పై సాధువులు అవగాహన కల్పించాలి