‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ విధానంపై అవగాహన కల్పించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హరిద్వార్‌లోని సాధువులకు విజ్ఞప్తి చేశారు. ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ విధానానికి మద్దతుగా పలుమార్లు మాట్లాడిన ఆయన, తరచుగా జరిగే ఎన్నికలు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తాయని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి ఈ విధానం ఎంతో అవసరమని ఆయన హరిద్వార్‌లోని సాధువులకు వివరించారు.
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించడం వల్ల సమయం, డబ్బు, పరిపాలనా వనరులు ఆదా అవుతాయని, తద్వారా ప్రభుత్వం, యంత్రాంగం అభివృద్ధి పనులపై మరింత దృష్టి సారించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ అంశంపై సాధువులు, మత పెద్దల సమావేశంలో పాల్గొన్న చౌహాన్, ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పం ఏ రాజకీయ పార్టీకి కాకుండా దేశ ప్రయోజనాలకు సంబంధించినదని తెలిపారు. “దేశం పురోగమిస్తేనే రాజకీయ పార్టీలు కూడా మనుగడ సాగిస్తాయి,” అని ఆయన పేర్కొన్నారు.
కాగా, 2034కు బదులుగా, తమకు మెజారిటీ ఉన్న 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 2029లోనే ఏకకాల ఎన్నికలు నిర్వహించే విషయాన్ని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) పరిశీలిస్తోందని ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ నివేదించింది. ప్రస్తుత బిల్లులలో పేర్కొన్న కాలక్రమం ప్రకారం, ఈ విధానాన్ని మొదటిసారిగా 2034లో అమలు చేయాలని నిర్ణయించారు.
గత నెలలో, లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాల ఎన్నికలు నిర్వహించే బిల్లును పరిశీలిస్తున్న పార్లమెంటు సంయుక్త కమిటీ గడువును శీతాకాల సమావేశాల ముగింపు వరకు పొడిగించారు. ఆ మేరకు కమిటీ చైర్మన్ పి.పి. చౌదరి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించారు.
సాధారణంగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ చివరి వారంలో ప్రారంభమై క్రిస్మస్ పండుగకు ముందే ముగుస్తాయి. ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ విధానాన్ని అమలు చేయడానికి ఉద్దేశించిన ‘రాజ్యాంగ (129వ సవరణ) బిల్లు, 2024’ను 41 మంది సభ్యుల కమిటీ పరిశీలిస్తోంది. 2029 నాటికి లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఏకకాల ఎన్నికలను నిర్వహించే ప్రతిపాదనపై ఈ కమిటీ దేశవ్యాప్తంగా సంప్రదింపులు జరుపుతోంది.
అంతకుముందు, ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ ప్రతిపాదనపై పార్లమెంటు సంయుక్త కమిటీకి సమర్పించిన ప్రాథమిక నివేదికలో, ఆరు నెలల ముందుగానే సమాచారం (నోటీసు) ఇస్తే లోక్‌సభ మరియు అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని ఎన్నికల సంఘం పేర్కొంది. ప్రతిపాదిత రాజ్యాంగ సవరణలపై తమ సిఫార్సులను ఖరారు చేసే ముందు, కమిటీ ఎన్నికల సంఘం అభిప్రాయాలను కూడా వింటుందని ప్యానెల్ చైర్మన్ పి.పి. చౌదరి తెలిపారు.

More Stories
చండీగఢ్‌లో ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు పట్టివేత
‘ఛాత్రోన్ కి గూంజ్’లో రాహుల్ వ్యాఖ్యలపై బిజెపి నేతల మండిపాటు
అయోధ్యలో కాంగ్రెస్ `చేపల విందు’ ఏర్పాటుపై దుమారం