దేశంలో గోధుమల ఎగుమతులపై గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. 2026 ఆగస్టు 24 నుంచి గోధుమల ఎగుమతి విధానాన్ని ‘నిషేధం’ నుంచి ‘స్వేచ్ఛ’ కేటగిరీలోకి మార్చింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజిఎఫ్టి) జారీ చేసిన తాజా నోటిఫికేషన్లతో ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చింది.
ఈ నిర్ణయం గోధుమలతో పాటు డ్యురమ్ గోధుమలకు వర్తిస్తుంది.
అంతేకాకుండా గోధుమ పిండి, మైదా, రవ్వ/సెమోలినా, హోల్మీల్ ఆటా, రిజల్టెంట్ ఆటా వంటి ఉత్పత్తుల ఎగుమతులపైనా ఉన్న ఆంక్షలు తొలగిపోయాయి. దీంతో భారతీయ రైతులు, మిల్లర్లు, వ్యాపారులకు అంతర్జాతీయ మార్కెట్లను మరింత విస్తృతంగా వినియోగించుకునే అవకాశం లభించనుంది. దేశీయంగా గోధుమల లభ్యత మెరుగుపడటం, ప్రభుత్వ నిల్వలు పెరగడం, ధరల పరిస్థితి అనుకూలంగా మారడం వంటి అంశాలు ఈ నిర్ణయానికి కారణాలుగా నిలిచాయి.
2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడటంతో దేశీయ ధరలు పెరిగాయి. ఆ సమయంలో ఆహార భద్రతను కాపాడటం, దేశీయ మార్కెట్లో ధరలను నియంత్రించేందుకు భారత్ 2022 మేలో గోధుమల ఎగుమతులపై నిషేధం విధించింది. అయితే ఈ ఏడాది కేంద్రం దశలవారీగా ఆంక్షలను సడలించింది. ఫిబ్రవరి 2026లో అదనంగా 5 లక్షల టన్నుల గోధుమ పిండి, సంబంధిత ఉత్పత్తుల ఎగుమతికి అనుమతి ఇచ్చింది.
అంతకుముందు అనుమతించిన పరిమితులతో కలిపి ప్రాసెస్డ్ గోధుమ ఉత్పత్తుల ఎగుమతికి కోటా పెరిగింది. ఇప్పుడు తాజా నిర్ణయంతో ఆ పరిమితులకూ ముగింపు పలికి, సంబంధిత గోధుమ ఉత్పత్తులకు స్వేచ్ఛా ఎగుమతి విధానం అమల్లోకి వచ్చింది. గతంలో 5 మిలియన్ టన్నుల వార్షిక పరిమితి గురించి చర్చ జరిగినప్పటికీ, తాజా విధానం కోటా ఆధారిత వ్యవస్థను తొలగించి ఎగుమతులకు మరింత స్వేచ్ఛ కల్పిస్తోంది.
ఈ పరిణామం రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించడంతో పాటు గోధుమ మిల్లింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ఊతమివ్వొచ్చు. అయితే దేశీయ సరఫరా, ధరలపై ప్రభుత్వం నిరంతరం నిఘా కొనసాగించే అవకాశం ఉంది.

More Stories
2030 నాటికి రష్యాతో 100 బిలియన్ డాలర్ల వాణిజ్యం
దేశంలో చదువు, ఉద్యోగం, శిక్షణలకు దూరంగా 8.7 కోట్ల మంది యువత
“ప్రపంచ ఫార్మసీ” నుండి “ప్రపంచ ప్రయోగశాల”గా ఆవిర్భవించాలి